అప్రజాస్వామిక పద్ధతిలో ఎంపీపీ ఎన్నిక
● ఆ ఎన్నికను రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ నేతల డిమాండ్
అనంతపురం: బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నిక అప్రజాస్వామిక పద్ధతిలో జరిగిందని వైఎస్సార్‌సీపీ రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తలు మెట్టు గోవిందరెడ్డి, తలారి రంగయ్య, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆ ఎన్నికను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి తదితరులతో కలిసి వారు మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నిక జరుగుతున్న హాలులో వైఎస్సార్‌సీపీకి చెందిన ఉంతకల్లు ఎంపీటీసీ సభ్యురాలు వనలక్ష్మిని మార్కెట్ యార్డ్ చైర్మన్ జి.హనుమంతరెడ్డి, మాజీ ఎంపీపీ భర్త చంద్రశేఖర్‌రెడ్డితో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలిపించి బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. అనంతరం బండూరు ఎంపీటీసీ సభ్యుడు హనుమేష్‌ను కానిస్టేబుల్ ధన్‌సింగ్ నాయక్ సీఐ పిలుస్తున్నారంటూ పక్క గదిలోకి తీసుకెళ్లి నిర్బంధించారన్నారు. గదిలోపలే ఎమ్మెల్యే కాలవతో పాటు ఆయన అనుచరులు ఉండి డబ్బు తీసుకుని అనుకూలంగా ఓటు వేయాలని, లేకుంటే అంతు చూస్తామని బెదిరించారన్నారు. అనంతరం గోవిందవాడ–2 ఎంపీటీసీ రమేష్ జోక్యం చేసుకుని ‘పార్టీ సభ్యులను ఎందుకు బయటకు పంపించారు.. లోపలికి పిలవండి’ అని ఎన్నికల అధికారులను కోరితే.. కాలవ శ్రీనివాసులు ‘ఏయ్ ప్రభుత్వం మాది.. అతి చేస్తే నీ అంతు చూస్తాం..జాగ్రత్త’ అంటూ హెచ్చరించారన్నారు. దీంతో తమ సభ్యులు వచ్చేంత వరకు ఎన్నిక నిర్వహించకూడదని హాలు నుంచి బయటకు వచ్చామన్నారు. తాము ఎంపీపీ అభ్యర్థిని ప్రతిపాదించలేదు.. బలపరచలేదు, తమ సభ్యులెవ్వరూ చేతులు ఎత్తలేదని, అయినా లోపల ఉన్న ఏడుగురు ఎంపీటీసీలతోనే ఎంపీపీ ఎన్నిక నిర్వహించారన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి అన్ని రికార్డులు, సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని, జాగ్రత్తగా భద్రపరచాలని డిమాండ్ చేశారు. వనలక్ష్మి (ఉంతకల్లు), శ్రీదేవి (డి.హొన్నూరు), కరూరు కల్పన (ఉద్దేహాళ్), బి.గీత (లింగదహాళ్), కె.రమేష్ (గోవిందవాడ–2), హనుమేష్ (బండూరు), బసవరాజు (కురువెళ్లి), ఎం.శివ శరణమ్మ (బొమ్మనహాళ్) 8 మంది ఎంపీటీసీలను డీఆర్‌ఓ ముందు హాజరు పరిచారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా మరోసారి ఎంపీపీ ఎన్నిక జరపాలని కోరారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్, హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
బొమ్మనహాళ్: మండల పరిషత్ అధ్యక్షురాలు (ఎంపీపీ)గా ముల్లంగి నాగమణి గెలిచినట్లుగా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి గంగాధర్ ప్రకటించారు. డిసెంబర్ 29న బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే నెల 31న ఫారం–5లో ఎంపీటీసీ సభ్యులకు నోటీస్ అందజేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎన్నికల ప్రిసైడింగ్ గంగాధర్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 16 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఇండిపెండెంట్ అభ్యర్ధితో కలిసి 15 మంది హాజరయ్యారు. దర్గాహొన్నూరు–1 ఎంపీటీసీ సభ్యురాలు కె.నాగరత్నమ్మ సమావేశానికి హాజరు కాలేదు. అధికార పార్టీ దౌర్జన్యాలకు నిరసనగా వైఎస్సార్‌సీపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనకుండా బయటకు వచ్చేశారు. మిగిలిన ఏడుగురు సభ్యులతోనే ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు. టీడీపీ మద్దతు తెలిపిన ఉప్పరహాళ్ ఎంపీటీసీ సభ్యురాలు ముల్లంగి నాగమణి గెలుపొందినట్లుగా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ప్రకటించి, ఆమెకు డిక్లరేషన్ అందజేశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, తహసీల్దార్ మునివేలు, ఎంపీడీఓ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


