
అనంతపురం ఎడ్యుకేషన్/సిటీ: ‘బడి ఈడు బాలికలు భిక్షాటన, చిత్తు పేపర్లు సేకరించుకుంటూ జీవనం సాగించడం ఏమిటి? ఆ అమ్మాయిలందరూ బడిలో ఉండాల్సిందే’ అంటూ సంబంధిత అధికారులను కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న బాలికలు అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి, కక్కలపల్లి కాలనీ పంచాయతీ కళ్యాణదుర్గం రోడ్డు నరిగిమ్మ ఆలయ సమీపంలో భిక్షాటన చేయడం, చిత్తు పేపర్లు సేకరిస్తున్న వైనంపై ‘ఇదేనా బాలికాభావృద్ధి’ శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. విచారణకు ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు.
పీడీ ఆదేశాలతో రాచానపల్లి సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి గాయత్రి, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ రఫి, ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసిస్టెంట్ మంజుభార్గవి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ భారతి, జిల్లా బాలల సంరక్షణ విభాగం సోషల్ వర్కర్ టి.వెంకట్‌కుమార్, చైల్డ్ హెల్ఫ్‌లైన్ సుహాసిని, స్థానిక అంగన్‌వాడీ వర్కర్ బృందంగా ఏర్పడి రంగంలో దిగారు. రాచానపల్లి ఎంపీపీ స్కూల్ వెనుక వైపు గుడారాలు వేసుకున్న వారితో మాట్లాడారు. భిక్షాటనకు వెళ్తున్న నలుగురు బాలికలు వారి పిల్లలే అని నిర్ధారించుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. నలుగురిలో ఇద్దరు బాలికలు 5వ తరగతి వరకు చదువుకోగా, మరో అమ్మాయి 6వ తరగతి వరకు చదువుకుంది. ఇంకో అమ్మాయిని పాఠశాలకే పంపలేదని తెలుసుకున్నారు.
ఇద్దరు బాలికలకు ‘తల్లికి వందనం’ డబ్బు కూడా జమ అయినట్లు గుర్తించారు. వలసల కారణంగా చదివించుకోలేక పోతున్నామని తల్లిదండ్రులు వాపోయారు. పిల్లలను చదివిస్తే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, వారి చదువులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఉద్యోగులు తెలిపారు. ఆడపిల్లలను భిక్షాటనకు పంపితే తల్లిదండ్రులపైనా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆడపిల్లల భద్రత విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడి కేజీబీవీల్లో చదువుకునే అవకాశం కల్పించాలని స్థానికులు కోరారు. తల్లిదండ్రులు వలస వెళ్లినా రెసిడెన్షియల్ స్కూళ్లల్లోనైతే ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఐసీడీఎస్ పీడీ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఐసీడీఎస్ ఉద్యోగులు తెలిపారు.