
విద్యార్థుల జీవితాలతో చెలగాటమొద్దు
అనంతపురం అర్బన్: విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడాన్ని మానుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలు పట్టించుకోని సీఎం డౌన్‌డౌన్, విద్యాశాఖ మంత్రి డౌన్‌డౌన్ అంటూ నాయకులు, విద్యార్థులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, మెస్‌చార్జీ రూ.3 వేలకు పెంచాలని, తదితర డిమాండ్లతో ఎస్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నాయకులు, విద్యార్థులు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గిరి, పరమేష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా విద్యారంగ సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందన్నారు. అధికారంలోకి వస్తే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి రూ.6,400 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని యువగళంలో లోకేష్ హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇచ్చిన హామీని అమలు చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వసతిగృహాల్లో మెస్ చార్జీలు రూ.3 వేలకు పెంచాలన్నారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులకు అవసరమైన ట్రంకు పెట్టెలు, బెడ్‌షీట్‌లు, దోమల తెరలు, ఇతరరాత్ర సామగ్రి అందజేయాలన్నారు. జీఓ 77 రద్దు చేసి, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ వినోద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, సూర్యప్రకాష్, అరుణ్, రషీద్, నవీన్‌యాదవ్, సోము, సాయి, విజయ్, నాగభూషణ్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ధ్వజం
కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా
ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలి
మెస్‌చార్జీలు రూ.3 వేలకు పెంచాలి