
నెట్టికంటుడి హుండీ కానుకల లెక్కింపు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 85.99 లక్షల ఆదాయం సమకూరింది. ఈ మేరకు ఆలయ ఈఓ ఎం.విజయరాజు తెలిపారు. సోమవారం ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. 70 రోజులకు గానూ రూ. 85,74,111 నగదు, అన్న దానం హుండీ ద్వారా రూ.25,063 నగదును భక్తులు సమర్పించారు. అలాగే 0.039 గ్రాముల బంగారు, 2.400 కిలోల వెండి సమకూరింది. హుండీ కానుకల లెక్కింపును ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ కె.రాణి, ఆలయ ఏఈఓ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పర్యవేక్షించారు. వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన వీరభద్ర సేవా సమితి, హనుమాన్ సేవా సమితి, రాఘవేంద్ర సేవా సమితి, శ్రీరామ సేవాసమితి సభ్యులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైద్యురాలికి తీవ్ర గాయాలు
పెద్దవడుగూరు: ద్విచక్రవాహనంపై వెళుతూ కిందపడిన ఘటనలో స్థానిక పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ పుష్పలత తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 9:30 గంటలకు మండలంలోని మొళకతాళ్ల గ్రామంలో 104 సేవలు అందించడానికి ఆమె వెళ్లారు. మధ్యాహ్నం 104 వాహన డ్రైవర్‌తో కలసి ద్విచక్ర వాహనంపై పీహెచ్‌సీకి తిరుగు ప్రయాణమైన ఆమె చిత్రచేడు జెడ్పీహెచ్‌ఎస్ వద్ద అదుపు తప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మొళకతాళ్లలో ఉన్న సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 104 వాహనంలో ఆమెను పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు.
‘పరిష్కార వేదిక’కు 60 వినతులు
అనంతపురం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 60 వినతులు అందాయి. ఎస్పీ పి.జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషా పాల్గొన్నారు.

నెట్టికంటుడి హుండీ కానుకల లెక్కింపు