
బతుకు తెరువు కోసం నగర శివారున భిక్షాటన
చదువుకోవాల్సిన వయసులో చిత్తుకాగితాల సేకరణ
అనంతపురం ఎడ్యుకేషన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్న బాలికాభివృద్ధి ప్రకటనల్లో తప్ప చేతల్లో కనిపిచండం లేదు. ఏటా ప్రత్యేక సర్వేలు నిర్వహించి బడిఈడు పిల్లలందరినీ గుర్తించి వారితో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడుల్లో చేర్పిస్తున్నారు. ఇందు కోసం రూ.లక్షల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. అయినా క్షేత్ర స్థాయిలో బడిఈడు పిల్లలు భిక్షాటనతో బతుకీడుస్తూనే ఉన్నారు. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రాలు.
నగర శివారులోని రాచానపల్లి వద్ద నలుగురు బాలికలు (అందరూ 10–12 ఏళ్లలోపు) జోలెలు భుజాన తగిలించుకుని భిక్షాటనకు వెళుతున్నారు. నగరంలో మరో ఇద్దరు బాలికలు సంచులు భుజాన వేసుకుని చిత్తుకాగితాల సేకరణలో నిమగ్నమయ్యారు. మరో బాలిక తల్లితో కలసి భిక్షాటనకు వెళ్తోంది. పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన వయసులో బాలికలు భిక్షాటన చేయడం, చిత్తుకాగితాలు ఏరుకోవడం చూపరుల హృదయాలను కదిలిస్తున్నాయి. అవగాహన లేకపోవడం ఒక కారణమైతే, ఆ దిశగా ఎవరూ పట్టించుకోకపోవడం మరో కారణమని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ జోక్యం చేసుకుని ఇలాంటి పిల్లలను గుర్తించి బలవంతంగానైనా బడిబాట పట్టించే చర్యలు తీసుకుంటే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.