
ఎక్కడికి వెళ్లినా నోస్టాక్ బోర్డులే !
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా అంతటా యూరియా నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలు, డీసీఎంఎస్‌లకు తగినంత సరఫరా చేసినట్లు ‘మార్క్‌ఫెడ్’ చెబుతున్నా ఎక్కడా బస్తా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ హోల్‌సేల్, రీటైల్ డీలర్లకు అవసరమైనంత ఇచ్చామని వ్యవసాయశాఖ అంటున్నా... వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ ఏప్రిల్ నుంచి జిల్లాకు చేరిన 14,286 మెట్రిక్ టన్నులతో పాటు గత ఖరీఫ్, రబీ మిగులుగా ఉన్న 15,241 మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదు. అయితే, ఇందులో సగానికి సగం పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలతో పాటు అధికారులు కుమ్మకై ్క తమకు యూరియా లభించకుండా చేశారని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, అరటి సాగు చేస్తున్న రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాకు చేరిన యూరియా నిబంధనలకు విరుద్ధంగా సరిహద్దు జిల్లాలతో పాటు సరిహద్దు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున తరలించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పరిస్థితి చేయిదాటాక రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తుండటంతో రైతులు విస్తుపోతున్నారు.
సెప్టెంబర్‌లో మరింత డిమాండ్..
ఆగస్టు రెండో పక్షం నుంచి యూరియా వాడకం ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్‌లో మరింత డిమాండ్ ఉంటుందని రైతులు చెబుతున్నారు. వరి, మొక్కజొన్న, అరటితో పాటు వేరుశనగ, కంది, పత్తి తదితర పంటలకు కూడా యూరియా వేసుకుంటారు. అధికారులు చెబుతున్నట్లు జిల్లా అంతటా జల్లెడ పట్టినా 500 మెట్రిక్ టన్నులు కూడా కనిపించడం లేదు. బఫర్‌స్టాక్ కింద 1,069 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు చెబుతున్నా అది ఎప్పుడు బయటకు తీస్తారో చెప్పడం లేదు. రెండు మూడు రోజుల్లో సరఫరా కాకపోతే సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ వారంలో ‘స్పిక్’ కంపెనీకి చెందిన యూరియా రావొచ్చని సమాచారం. మార్క్‌ఫెడ్ నుంచి ఈ ఏప్రిల్ నుంచి 453 ఆర్‌ఎస్‌కేలకు 3 వేల మెట్రిక్ టన్నులు, అనంతపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి డీసీఎంఎస్‌లకు 843 మెట్రిక్ టన్నులు, రెండు ఎఫ్‌పీఓలు, 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2,200 మెట్రిక్ టన్నుల వరకు సరఫరా చేశామని చెబుతున్నారు. ఇక.. వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్న యూరియా లెక్కలు సరిపోవడం లేదు. ఇరుశాఖల మధ్య వ్యత్యాసం అధికంగా ఉండటంతో యూరియా పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. గార్లదిన్నెలో, మన గ్రోమోర్‌లో, అనంతపురంలో మూడు చోట్ల... ఇలా రీటైల్ షాపులో అక్కడక్కడా యూరియా ఉందని అధికారులు చెబుతున్నా బయటికి మాత్రం రావడంలేదు. ఎంఆర్‌పీకి మించి అమ్ముకునేందుకు హోల్‌సేల్, రీటైల్ వ్యాపారులు అంతో ఇంతో ఉన్న యూరియాను బయటకు తీయకుండా గుట్టుగా వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్, జూలైలో వ్యవసాయశాఖ పరిధిలో జరిగిన ఏడీఏ, ఏఓ, ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ కూడా యూరియా పక్కదారి పట్టడానికి మార్గం సుగమం చేసినట్లు తెలిసింది.
ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలు,
డీసీఎంఎస్ వద్ద లభించని యూరియా
రీటైల్ డీలర్ల దగ్గర కొంత ఉన్నా
బయటకు తీయని వైనం
యూరియా దొరక్క వరి, మొక్కజొన్న, అరటి రైతుల అవస్థలు