
గాల్లో తల్లీబిడ్డ ప్రాణాలు
అనంతపురం మెడికల్: అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా తయారైంది ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని గైనిక్ విభాగం పరిస్థితి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గైనిక్ విభాగం కోసం అత్యాధునిక హంగులతో లేబర్ ఆపరేషన్ థియేటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పేదలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అలసత్వం కారణంగా నేడు లేబర్ వార్డు మధ్యాహ్నం వరకు మాత్రమే నడుస్తోంది. జనరేటర్ సాకు చూపుతూ సిజేరియన్లను మెయిన్ ఆపరేషన్ థియేటర్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నిండుచూలాలతో పాటు వైద్యులకూ అవస్థలు తప్పడం లేదు.
పరుగులు పెట్టాల్సిందే..
ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్‌లో సిజేరియన్లు చేసే వారు. ఇటీవల అక్కడ క్యాజువాలిటీ విస్తరణ చేపడుతుండడంతో ఎమర్జెన్సీ కేసులను ఆపేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో మెయిన్ ఓటీకి తరలించాల్సి వస్తోంది. వాస్తవంగా లేబర్ ఆపరేషన్ థియేటర్‌లోనే అన్ని సదుపాయాలున్నాయి. కానీ గర్భిణులను అత్యవసరం పేరిట ఇబ్బందులు పెడుతూ మొదటి అంతస్తులో ఉన్న మెయిన్ ఓటీకి తీసుకెళ్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అంతర్జాతీయ వైద్య ప్రమాణాలకు అనుగుణంగా గైనిక్ వార్డు ఉన్న ప్రాంతంలోనే లేబర్ ఓటీ ఏర్పాటు చేశారు. అత్యవసర కేసు 20 నిమిషాల్లోపు ఓటీకి తీసుకెళ్లి సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఆస్పత్రిలో సీరియస్ కేసులను మెయిన్ ఓటీకి తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో ఆక్సిజన్, ఇతర పరికరాలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చిన్న పొరపాటు జరిగినా తల్లీ,బిడ్డ ప్రాణాలకే ప్రమాదం లేకపోలేదు.
నెలకు 700 నుంచి 800 ప్రసవాలు..
ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు సర్వజనాస్పత్రి పెద్ద దిక్కు. సాధారణ కేసుల నుంచి కష్టతరమైన కేసులన్నీ ఇక్కడికి వస్తుంటాయి. రోజూ 20 నుంచి 30 ప్రసవాలు జరుగుతాయి. అందులో 5 నుంచి 6 వరకు సిజేరియన్లు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపి గర్భిణులకు ఇబ్బంది కలగకుండా లేబర్ ఓటీలోనే సిజేరియన్లు జరిగేలా చూడాలని గైనిక్ విభాగానికి చెందిన పలువురు కోరుతున్నారు. ఆ విభాగం వైద్యులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జీజీహెచ్‌లో లేబర్ ఓటీ సమస్య
మధ్యాహ్నం నుంచి
మెయిన్ ఓటీకి వెళ్లాల్సిందే
నిండు చూలాలతో పాటు
వైద్యులకూ అవస్థలు