
గ్రానైట్.. రైట్‌రైట్
కూడేరు: మండలంలోని కొర్రకోడు రెవెన్యూ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 127లో గల నల్లగుట్టలో గ్రానైట్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. నల్లగుట్ట సుమారు 5 ఎకరాలకు పైగా విస్తరించింది. ఇక్కడ విలువైన గ్రానైట్ రాయి ఉండడంతో నంద్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కన్నేశాడు. హిటాచీలు, జేసీబీలు పెట్టి కొన్ని రోజులుగా డ్రిల్లింగ్ యంత్రాలతో పెద్ద పెద్ద రాళ్లను బయటకు తీయిస్తున్నాడు. కార్మికులు ఈ ప్రాంతంలో టెంట్లు వేసుకుని పగలంతా రాళ్లను బయటకు తీసి అనంతరం బ్లాక్‌లుగా కత్తిరిస్తున్నారు. రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా భారీ వాహనాల్లో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు.
పట్టని అధికారులు..
పట్టపగలే గ్రానైట్ కార్యకలాపాలు సాగిస్తున్నా పట్టించుకునే నాథుడే లేరు. అక్రమ గ్రానైట్ తవ్వకాలు, రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇప్పటికే ఇక్కడ సుమారు 2 వేల క్యూబిక్ మీటర్ల వరకూ తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. సాధారణంగా క్యూబిక్ మీటర్ తవ్వకానికి రూ.4,800 చొప్పున ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ఈ లెక్కన ప్రభుత్వానికి రూ.10 లక్షల వరకూ నష్టం వాటిల్లినట్లు సమాచారం. నెల రోజులుగా పీఏబీఆర్, మండల కేంద్రానికి దగ్గర్లో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రానైట్ తవ్వకాలు సాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతోనే తవ్వకాలు చేపడుతున్నారని తెలిసింది.
జోరుగా అక్రమ తవ్వకాలు
కన్నెత్తి చూడని అధికారులు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
ఎలాంటి అనుమతి ఇవ్వలేదు
కొర్రకోడు రెవెన్యూ పొలం సర్వే నంబర్ 127లోని నల్లగుట్టలో గ్రానైట్ తవ్వకాలకు రెవెన్యూ శాఖ ద్వారా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా గ్రానైట్ తవ్వకాలు చేపట్టకూడదు. వారి వద్ద అనుమతులు ఏమున్నాయో విచారించాలని వీఆర్వోలను ఆదేశించాం. నిబంధనలు అతిక్రమించి ఉంటే చర్యలు తీసుకుంటాం.
– మహబూబ్ బాషా, తహసీల్దార్, కూడేరు మండలం

గ్రానైట్.. రైట్‌రైట్

గ్రానైట్.. రైట్‌రైట్