
ఉచిత బస్సు.. తుస్సు
● సరిహద్దు గ్రామాల మహిళలకు నిరాశ
● గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రయోజనం శూన్యం
బొమ్మనహాళ్: ఉచిత బస్సు ప్రయాణం గ్రామీణ ప్రాంత మహిళలకు వర్తించడం లేదు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో లాంటి ఐదు రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కర్ణాటక సరిహద్దున ఉన్న బొమ్మనహాళ్ మండలంలోని గ్రామాల మహిళలకు తీరని కలగానే మిగులుతోంది. బొమ్మనహాళ్, ఉద్దేహాళ్ గ్రామాల్లో ఉన్న బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, కళ్యాణదుర్గంలో ఉన్న ఆర్డీటీ ఆస్పత్రికి రోజూ మహిళలు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఈ మార్గంలో తిరిగే బస్సులన్నీ పొరుగున ఉన్న కర్ణాటకకు వెళ్లి వస్తుంటాయి. మండలంలోని గోనేహాళ్, క్రాస్ నుంచి బొమ్మనహాళ్‌కు వెళ్లాలంటే మహిళలు టికెట్ తీసుకోవాల్సిందేనని కండెక్టర్లు అంటున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసు బస్సులకు ఉచిత ప్రయాణం కల్పించలేదని స్పష్టం చేస్తున్నారు. బొమ్మనహాళ్ నుంచి కళ్యాణదుర్గం వెళ్లాలన్నా టికెట్ తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఉచిత బస్సు అంటూ కర్ణాటక ప్రాంత సరిహద్దున ఉన్న తమకు అన్యాయం చేశారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.