కళ్లప్పగించి చూసి.. చివరికి కదిలి! | - | Sakshi
Sakshi News home page

కళ్లప్పగించి చూసి.. చివరికి కదిలి!

Aug 24 2025 7:43 AM | Updated on Aug 24 2025 7:43 AM

కళ్లప్పగించి చూసి.. చివరికి కదిలి!

కళ్లప్పగించి చూసి.. చివరికి కదిలి!

అనంతపురం అగ్రికల్చర్‌:యూరియా విషయంలో సర్కారు తీరు చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది. ఖరీఫ్‌లో జిల్లాకు కేటాయింపులే తగ్గించారు. అందులోనూ కోతలు పెట్టారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన జిల్లాకు ఇబ్బంది రాకుండా శ్రీకాకుళంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సరఫరా పెంచినట్లు చెబుతున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాకు మాత్రమే సరఫరా చేయాల్సిన యూరియా ఈ ఏడాది కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లాలకు కొంత కేటాయింపులు చేశారు. అంతో ఇంతో వచ్చినదాంట్లో ప్రైవేట్‌ హోల్‌సేల్‌ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు రైతుల పేరుతో సరిహద్దు ప్రాంతంలో పక్కనున్న కర్ణాటక ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలు, డీసీఎంఎస్‌లకు కేటాయించిన యూరియాను దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు హడావుడి చేస్తున్నారు. ఇలా... యూరియా చెల్లాచెదురు కావడంతో అన్నదాతకు అవసరానికి అందకుండా పోతోంది. బస్తా... రెండు బస్తాల కోసం కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి ఏర్పడింది. యూరియా నిల్వలు ఖాళీ అయిన తర్వాత సర్కారు పెద్దల ఆదేశాలతో విజిలెన్స్‌, వ్యవసాయశాఖ, పోలీసు, రెవెన్యూ, సహకార శాఖలతో ఏర్పాటు చేసిన జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ గత రెండు రోజులుగా ఎరువుల గోదాముల్లో ఉత్తుత్తి తనిఖీలతో రైతులను మభ్యపెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వచ్చింది 14,286 మెట్రిక్‌ టన్నులు:

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని రకాల ఎరువులు 1.07 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరమని ప్రణాళిక అమలు చేస్తున్నారు. యూరియా 26,839 మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. అందులో ఇప్పటి వరకు 21 వేల మెట్రిక్‌ టన్నులు రావాల్సి వుండగా 14,286 మెట్రిక్‌ టన్నులు జిల్లాకు చేరింది. ఒక కంపెనీ నుంచి రావాల్సిన యూరియా ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లినట్లు తెలిసింది. అలాగే మరికొంత వైఎస్సార్‌ కడప, కర్నూలుకు సరఫరా చేయడంతో జిల్లాలో సమస్య ఉత్పన్నమైనట్లు అంచనా వేస్తున్నారు. గత ఖరీఫ్‌, రబీకి సంబంధించి 15,241 మెట్రిక్‌ టన్నులు మిగులుబాటు ఉండగా... ఈ ఏడాది దాన్ని కలుపుకుని ఇప్పటి వరకు 26,610 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం 1,069 మెట్రిక్‌ టన్నులు బఫర్‌స్టాక్‌ ఉండగా ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలు, డీసీఎంఎస్‌లు, ప్రైవేట్‌ డీలర్ల వద్ద 1,671 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నట్లు పొంతన లేని లెక్కలు చూపుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నా బఫర్‌స్టాక్‌ 1,069 మెట్రిక్‌ టన్నులు బయటకు తీయకపోవడం గమనార్హం. ప్రస్తుతం అందుబాటులో ఉందంటున్న 1,671 మెట్రిక్‌ టన్నులు ఎక్కడుందనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. అక్కడక్కడా కృత్రిమ కొరత సృష్టించి బస్తా యూరియా ఎంఆర్‌పీకి మించి రూ.350 నుంచి రూ.400 ప్రకారం అమ్ముతున్నట్లు రైతులు వాపోతున్నారు. యూరియా బస్తా కావాలంటే నానో యూరియాతో పాటు డ్రిప్‌ మందులు తప్పనిసరిగా తీసుకోవాలని మెలిక పెడుతుండడంతో రైతులపై భారం పడుతోంది.

రైతు సంక్షేమం అంటే ఇదేనా?

ఈ ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం తగ్గినా యూరియాకు డిమాండ్‌ రావడం చూస్తే... పెద్ద ఎత్తున పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. ఎరువుల సరఫరా, అమ్మకాలు, మరీ ముఖ్యంగా యూరియా అమ్మకాలపై పర్యవేక్షణ చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైనట్లు తెలుస్తోంది. తీరా సమస్య ఉత్పన్నమైన తర్వాత హడావుడి చేస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా ఉన్నా రైతు సంక్షేమంపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ విస్తారంగా వర్షాలు పడటం, లక్షలాది హెక్టార్లలో ఖరీఫ్‌, రబీ పంటలు, అలాగే ఉద్యాన పంటలు విస్తరించినా... ఎక్కడా ఎరువుల సమస్య అనేది ఉత్పన్నం కాలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.

గోదాముల్లో ఉత్తుత్తి తనిఖీలు చేస్తున్న ‘టాస్క్‌ఫోర్స్‌’

శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర, కడప, కర్నూలుకు యూరియా సరఫరా

ఎరువుల కోసం ఇప్పటికీ

రోడ్డెక్కుతోన్న అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement