
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
రాప్తాడు: మండల కేంద్రానికి చెందిన మాజీ స్టోర్ డీలర్, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ జూటూరు లక్ష్మన్న తనకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలని రాప్తాడు పోలీసుస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాలమేరకు.. ఈ ఏడాది మే 14న పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సీఐ సార్‌ను కలవాలని తనకు ఫోన్ వచ్చిందన్నారు. తాను పోలీసుస్టేషన్ లోపలికి వెళ్తుండగా.. రాప్తాడుకు చెందిన మారుతీ, నారాయణ, జగదీష్‌లు పోలీస్‌స్టేషన్ ముందే తనపై దాడి చేశారన్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగినా చెప్పలేదన్నారు. వారిపై కేసు నమోదు చేయాలని అప్పట్లో ఫిర్యాదు చేసినా నేటికీ పోలీసులు స్పందించలేదన్నారు.
నిన్ను కొడితే దిక్కెవరు?
తాజాగా శనివారం సాయంత్రం ఎస్సీ కాలనీలోని తన ఇంటి ముందు కూర్చొని ఉండగా గతంలో దాడి చేసిన నారాయణ మళ్లీ దాడికి యత్నించాడని లక్ష్మన్న ఆవేదన వ్యక్తం చేశారు. బండి ఎక్కు .. నీతో పని ఉందని బూతులు తిట్టారన్నారు. కొడితే దిక్కెవరని, పోలీసులు కూడా మేమంటే భయపడతారన్నారన్నారు. నారాయణ నుంచి తప్పించుకొని, వచ్చి నారాయణ, మారుతీ, జగదీష్‌ల నుంచి తనకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలని మరోసారి పోలీసులను వేడుకున్నానని లక్ష్మన్న తెలియజేశారు.