ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఎరువుల మాఫియా | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఎరువుల మాఫియా

Aug 24 2025 7:43 AM | Updated on Aug 24 2025 7:43 AM

ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఎరువుల మాఫియా

ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఎరువుల మాఫియా

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం

అనంతపురం కార్పొరేషన్‌:కూటమి ప్రభుత్వంలో మద్యం, ఇసుక, ల్యాండ్‌ మాఫియాతో పాటు ఎరువుల మాఫియానూ చూస్తున్నామంటూ వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే మాఫియా నడుస్తోందని దుయ్యబట్టారు. శనివారం ఆయన వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్నదాతలను ఆదుకోవాలని ఏడాదిగా తాము ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని గుర్తు చేశారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలోని 8.5 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించిన ఎరువులను ఎప్పుడో అందించామని చెబుతున్నాయి. కానీ జిల్లాలో ప్రస్తుతం 5.5 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఇంకా 3 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించిన ఎరువులు ఏమయ్యాయి’ అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాలో సైతం ఎరువుల దోపిడీ, బ్లాక్‌ మార్కెట్‌ గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయని, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రజాప్రతినిధులకు తెలిసే అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

బ్లాక్‌మార్కెట్‌లో ఎరువులు..

జిల్లాలో వేసిన పంటలు కూడా ఇప్పటికే దెబ్బతిన్నాయని, వేరుశనగ 4.5 లక్షల ఎకరాల్లో పంట విస్తీర్ణం ఉండేదని, అలాంటిది నేడు 1,71,000 ఎకరాల్లో మాత్రమే వేసిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో మిర్చి, పత్తి, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు వేసుకోవడానికి యూరియా, డీఏపీ అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ఎరువులను బ్లాక్‌మార్కెట్‌లో కొనాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రూ.266.50తో యూరియా బస్తా అమ్మాల్సి ఉంటే రూ.350–రూ.400 వరకూ విక్రయిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. రూ.1,300 ఉన్న డీఏపీకి రూ.1,600 సమర్పించుకుంటే తప్ప దొరికే పరిస్థితి లేదన్నారు. డీసీఎంఎస్‌, మార్క్‌ఫెడ్‌, రైతు సేవా సంస్థలు దోపిడీ కేంద్రాలుగా మారిపోయినా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్నారు.

పట్టించుకున్న పాపాన పోలేదు:

సీఎం చంద్రబాబు, ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, 14 మంది ఎమ్మెల్యేలు, కలెక్టర్లు రైతులను ఆదుకునే ప్రయత్నం చేసిన పాపాన పోలేదన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాము ఈ ఏడాది జూలైలో ఓసారి, ఆగస్టు 4న మరోసారి ఐఏబీ, డీఆర్‌సీ సమావేశం ఏర్పాటు చేయాలని విన్నవించినా నిర్లక్ష్యం చేశారన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ సీజన్‌కు అనుగుణంగా పంట నష్టపరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించారని గుర్తు చేశారు. ఇన్సూరెన్స్‌ ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించి భారం తగ్గించిందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులపై ప్రీమియం భారం మోపారని దుయ్యబట్టారు. సౌత్‌, నార్త్‌, తాడిపత్రి బ్రాంచ్‌ కెనాల్‌కు వెంటనే నీరు వదిలే ఏర్పాట్లు చేయాలని, రైతులను ఆదుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో రైతు విభాగం అనంతపురం నియోజకవర్గ అధ్యక్షుడు చిదంబర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement