
వందశాతం లక్ష్యాలు సాధించాలి
అనంతపురం అగ్రికల్చర్: నిర్ధేశిత మార్కెట్ ఫీజుకు సంబంధించి అన్ని మార్కెట్ కమిటీలు వందశాతం వసూళ్లు సాధించాలని మార్కెటింగ్‌శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సి.రామాంజినేయులు ఆదేశించారు. శనివారం స్థానిక మార్కెటింగ్‌శాఖ కార్యాయలంలో రెండు జిల్లాల ఏడీలు రాఘవేంద్రకుమార్, ఎల్‌ఎన్ మూర్తితో కలిసి 17 మార్కెట్ కమిటీల సెక్రటరీలు, సూపర్‌వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత 2025–26 సంవత్సరంలో మార్కెట్‌యార్డుల వారీగా టార్గెట్, ప్రస్తుతానికి సాధించిన ప్రగతిపై సమీక్షించారు. సగం కమిటీల పరిస్థితి మెరుగ్గా ఉండగా సగం కమిటీలు చాలా వెనుకబడ్డాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పరిఽధిలో ఉన్న 9 కమిటీలకు సంబంధించి రూ.13.49 కోట్లు లక్ష్యం కాగా ప్రస్తుతానికి 30 శాతంతో 3.95 కోట్లు సాధించారన్నారు. ఇందులో గుత్తి, రాప్తాడు, గుంతకల్లు కమిటీల పరిస్థితి చాలా నిరాశాజనకంగా ఉందన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఉన్న ఏడు మార్కెట్ కమిటీల టార్గెట్ రూ.5.82 కోట్లు కాగా అక్కడ కూడా 30 శాతం వసూళ్లు సాధించినట్లు తెలిపారు. ధర్మవరం, హిందూపురం, తనకల్లు కమిటీల్లో వసూళ్లు పెరగాలని తెలిపారు. విజిలెన్స్ బృందాలు తరచు క్షేత్రస్థాయిలో పర్యటించి గడువులోపు వంద శాతం లక్ష్యం చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.