వైఎస్సార్ సీపీ కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి
రాప్తాడు మండలం హంపాపురంలో ఘటన
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ‘ఏరా నా కొడకా.. మా ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి పోవడమే కాకుండా, గ్రామంలో మరికొంత మందిని ఎలా తీసుకెళ్తావ్.. నీకు ఎంత ధైర్యం’ అంటూ టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త జానగాని సుధాకర్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు... మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాప్తాడు మండలం హంపాపురం సమీపంలోని ఆర్‌కే ఫంక్షన్ హాలులో ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ సమావేశం నిర్వహించారు.
సమావేశానికి హంపాపురం నుంచి అధిక సంఖ్యలో వైఎస్సార్ సీపీ నాయకులు తరలివెళ్లారు. దీన్ని జీర్ణించుకోలేని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జానగాని వీరన్న, జాన గాని కార్తీక్, జానగాని రమణ, జానగాని లోకేష్, డీలర్ వెంకట రమణ గ్రామంలో సాయంత్రం అలజడి సృష్టించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త జానగాని సుధాకర్‌పై దాడి చేశారు. కింద పడేసి తొక్కడంతో సుధాకర్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు.వెంటనే అతడిని కుటుంబీ కులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.