
ఎమ్మెల్యే దగ్గుపాటిపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైన ప్రభాకర్ చౌదరి
అనంత టీడీపీలో తారస్థాయికి కుమ్ములాటలు
ఎమ్మెల్యే దగ్గుపాటిపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైన ప్రభాకర్ చౌదరి
నేడు ‘న్యాయ చర్చావేదిక’కు ఏర్పాట్లు
అభివృద్ధి మరచి ఏడాది కాలంగా కత్తులు దూస్తున్న నేతలు
విసిగిపోతున్న ప్రజలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లాలో ఇప్పటికే పాలన పడకేసింది. సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చూపాల్సిన టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్న తీరు విస్తుగొలుపుతోంది. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా హామీలు అమలు చేయలేని దుస్థితిలో ఉన్న కూటమి సర్కారుకు నేతల మధ్య కుమ్ములాటలు తాజాగా పెద్ద తలనొప్పిగా మారాయి. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో రోజుకో వివాదంతో టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయినా పార్టీ పెద్దలకు చీమ కుట్టినట్లయినా లేదని ‘తెలుగు తమ్ముళ్లు’ వాపోతున్నారు.
ఫిర్యాదుల మీద ఫిర్యాదులు..
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మొదలు భూ కబ్జాల వరకూ ప్రతి అంశంలోనూ ఎమ్మెల్యే దగ్గుపాటి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నగరాన్ని వసూళ్లకు కేరాఫ్ అడ్రెస్‌గా మార్చారని గతంలో బహిరంగంగానే ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే దగ్గుపాటిపై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదే స్థాయిలో దగ్గుపాటి కూడా చౌదరిపై విమర్శలు గుపిస్తున్నారు. ప్రతి వివాదంలోనూ తన ప్రమేయం ఉందంటూ చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అనంతపురం అర్బన్‌లో పార్టీని ప్రభాకర్ చౌదరి భ్రష్టు పట్టిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ రాలేదని ఏకంగా పార్టీ కార్యాలయానికి నిప్పుపెట్టిన వారు పార్టీకి అవసరం లేదని వాదిస్తున్నారు.
అస్రా ఆప్టికల్ షాపు కబ్జాపై రగడ..
నాలుగు రోజుల క్రితం కొంతమంది యువకులు అనంతపురం సాయినగర్‌లోని ‘అస్రా’ కంటి అద్దాల షాపును కబ్జా చేసేందుకు యత్నించారు. ఈ అంశం తాజాగా ప్రభాకర్ చౌదరి, దగ్గుపాటి మధ్య గొడవకు దారి తీసింది. ఎమ్మెల్యే అనుచరులే కబ్జాకు యత్నించారని ప్రభాకర్ చౌదరి ఆరోపిస్తుంటే.. ఈ కుట్ర వెనుక ప్రభాకర్ చౌదరే కీలకంగా ఉన్నారని దగ్గుపాటి అంటున్నారు.
న్యాయ చర్చావేదిక.. రచ్చ
‘అస్రా’ షాపు కబ్జాకు సంబంధించి బుధవారం ప్రభాకర్ చౌదరి న్యాయ చర్చావేదిక ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన అనుచరులు ప్రకటించారు. ఈ సందర్భంగా నగరంలో ముస్లిం మైనార్టీలతో మాట్లాడతారని చెప్పడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు ఉలిక్కిపడ్డారు. చౌదరిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రభాకర్ చౌదరి, దగ్గుపాటి నడుమ నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇక.. టీడీపీలోనే రెండు వర్గాలు నిత్యం గొడవల్లో మునిగి తేలుతుండడం.. ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడంతో అనంతపురం నగర అభివృద్ధి పూర్తిగా పడకేసింది. టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలతో సామాన్యులు విసిగిపోతున్నారు.