
ఫసల్ బీమా రూ.77.49 కోట్లు విడుదల
అనంతపురం అగ్రికల్చర్: ప్రధానమంత్రి ఫసల్‌బీమా కింద రైతులకు రూ.77.49 కోట్ల పరిహారం విడుదల చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023 ఖరీఫ్, రబీతో పాటు 2024 ఖరీఫ్‌కి సంబంధించి దిగుబడి ఆధారిత బీమా అమలు చేసిన ఫ్యూచర్ జనరిక్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డబ్బులు విడుదలవుతాయన్నారు. ఇందులో 2023 ఖరీఫ్‌కు సంబంధించి కంది, ఎండుమిరప, జొన్న రైతులకు రూ.3.39 కోట్లు, రబీలో పప్పుశనగ, వేరుశనగ రైతులకు రూ.15.26 కోట్లు విడుదల కానుండగా 2024 ఖరీఫ్‌కు సంబంఽధించి కంది, జొన్న రైతులకు రూ.58.83 కోట్లు కలిపి రూ.77.49 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. 10 రోజుల్లోపు బీమా పరిహారం రైతుల ఖాతాల్లో జమవుతుందని స్పష్టం చేశారు.