
యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు
● రాయల్టీ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి
● తెలిసినా పట్టన ట్లు వ్యవహరిస్తున్న అధికారులు
గార్లదిన్నె: శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలంలో ఆదాయం కోసం అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు. అనధికారికంగా ఇసుక, మట్టి కొల్లగొట్టుకుపోతున్నారు. కళ్లెదుటే కనిపిస్తున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు సహజ వనరులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఇటీవల కల్లూరులో టీడీపీ మట్టి మాఫియా ఏకంగా రెవెన్యూ అధికారులపైనే దాడులు చేసిన విషయం విదితమే. అనుమతులు లేకుండా ప్రభుత్వ గుట్టల్లో హిటాచీ, జేసీబీ యంత్రాలతో మట్టి తవ్వకాలు జరిపి టిప్పర్ల ద్వారా రోడ్ల నిర్మాణాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాయల్టీ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు.
● ఇక గ్రామాల్లో కొందరు వ్యక్తులు ఎర్రమట్టి వ్యాపారాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాక్టర్లలో మట్టి తరలింపు కొనసాగుతోంది. కల్లూరులో సింగరప్ప కొండ, జంబులదిన్నె కొట్టాలలో ప్రభుత్వ గుట్ట, అదే విధంగా పలు గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో కూడా దర్జాగా మట్టి తవ్వకాలు చేస్తూ అక్రమ దందాను యథేచ్ఛగా చేపడుతున్నారు. వ్యాపారులకు ఎర్రమట్టి కాసులు కురిపిస్తోంది. అనధికారిక మట్టి తవ్వకాలను అరికట్టాల్సిన అధికారులు.. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి, మామూళ్ల మత్తులో జోగుతూ అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అనుమతి తప్పనిసరి
ప్రభుత్వ భూములు, పట్టా భూములు ఏ భూములలోనైనా మట్టి తవ్వకాలు చేయాలంటే మైనింగ్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి ఏ సర్వే నంబర్‌లో తవ్వకాలు చేస్తున్నారు.. ఎంత లోతు తవ్వకాలు చేయాలి... ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి తీసుకుంటున్నారు.. మట్టి తరలిస్తే భూగర్భజలాలు అడుగంటి పోయే అవకాశం ఉందా అనే వివరాలు కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది.
– మల్లికార్జున, డిప్యూటీ తహసీల్దార్, గార్లదిన్నె