
అభివృద్ధి పట్టాలపై గుంతకల్లు డివిజన్
● పంద్రాగస్ట్ వేడుకల్లో డీఆర్‌ఎం సీఎస్ గుప్తా
గుంతకల్లు: ప్రయాణికుల భద్రత, సరుకు రవాణా తదితర అన్ని విభాగాల్లో గుంతకల్లు డివిజన్ ఆల్ రౌండ్ ప్రతిభతో దూసుకెళ్తోందని రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశేఖర్‌గుప్తా పేర్కొన్నారు. స్థానిక రైల్వే క్రీడా మైదానంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి ఆర్‌పీఎఫ్‌ల నుంచి డీఆర్‌ఎం గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గడచిన నాలుగు నెలల్లో 15 మిలియన్ల ప్రయాణికులు టిక్కెట్ల కొనుగోలు ద్వారా రూ.361 కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. దాదాపు 48 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపడం ద్వారా మరో రూ.8 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. డివిజన్‌లోని పాణ్యం–బుగ్గనపల్లి స్టేషన్ల మధ్య డబులింగ్ రైలు మార్గం పనులు పూర్తి చేశామన్నారు. అమృత్ స్టేషన్ స్కీమ్ కింద డివిజన్ పరిధిలోని 17 రైల్వేస్టేషన్లలో తొలి విడత కింద రూ.234 కోట్లు, రెండో విడత కింద రూ.358 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం డివిజన్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం యూ.సుధాకర్, సీనియర్ డీపీఓ కోర్డినేషన్ హెచ్‌ఎల్‌ఎన్ ప్రసాద్, సీనియర్ డీసీఎం మనోజ్, ఆర్‌పీఎఫ్ కమిషనర్ ఆకాష్ జైశ్వాల్ పాల్గొన్నారు.
ప్రయాణికుల భద్రతే లక్ష్యం
ప్రయాణికుల భద్రతే తమ లక్ష్యమని గుంతకల్లు రైల్వే జీఆర్‌పీ ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక జీఆర్‌పీ ఎస్పీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ ఏడాది విశేష సేవలు అందించిన జీఆర్‌పీలకు అవార్డులను ప్రదానం చేశారు. డీఎస్పీ శ్రీనివాస ఆచారి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పట్టాలపై గుంతకల్లు డివిజన్

అభివృద్ధి పట్టాలపై గుంతకల్లు డివిజన్