
బ్రిటీష్ పాలనను తలపిస్తున్న కూటమి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
అనంతపురం కార్పొరేషన్: దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు, బెదిరింపులు, కక్షసాధింపు చర్యలతో కూటమి ప్రభుత్వం బ్రిటీష్ పాలనను తలపిస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తే.. ప్రస్తుత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అవినీతి పెచ్చుమీరిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో పూర్తి నెరవేర్చకపోగా.. అమలు చేస్తున్న అరకొర పథకాల్లో అనేక కొర్రీలతో అర్హులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్నారు. పోలీసు వ్యవస్థ మరీ దారుణంగా తయారైందన్నారు. పోలీసులే దగ్గరుండి ఎన్నికల్లో అక్రమాలు జరిగేలా చేశారని విమర్శించారు. నాడు బ్రిటీష్ వారిపై ఏవిధంగా పోరాటాలు చేశారో.. కూటమి ప్రభుత్వంపై అలాంటి పోరాటాలు చేసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తుందన్నారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం అని, ఆ స్ఫూర్తితో తాము ప్రజల కోసం పోరాటాలు చేస్తామని, అందుకు ప్రతి కార్యకర్తా కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సైఫుల్లాబేగ్, మల్లెమీద నరసింహులు, శ్రీదేవి, బాకే హబీబుల్లా, శ్రీనివాసులు నాయక్, అమర్‌నాథ్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కృష్ణవేణి, పెన్నోబులేసు, నాయకులు శ్రీనివాసులు, రియాజ్, అనిల్ కుమార్‌గౌడ్, సాకే కుళ్లాయి స్వామి, చంద్రలేఖ, హజరాబి, రాధాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.