
మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలు
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా మాజీ సైనికులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయసేవలు అందించనున్నట్లు జిల్లా జడ్జి భీమారావు తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ఏర్పాటు చేసి ఉచిత న్యాయ సేవలు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం అనంతపురం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కోవూరు నగర్‌లోని జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్‌ను జిల్లా జడ్జి ప్రారంభించారు. పెన్షన్, భూ వివాదాలు, కుటుంబ సమస్యలు తదితర అన్ని న్యాయ సంబంధిత సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.రాజశేఖర్, జిల్లా సైనిక సంక్షమ అధికారి పి.తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
‘డిజైన్ థింకింగ్’ కోర్సు ప్రారంభం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సహకారంతో మూడో వ్యాల్యూ యాడెడ్ కోర్సు ‘డిజైన్ థింకింగ్ సర్టిఫికెట్ కోర్సు’ను ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి.అనిత శుక్రవారం ప్రారంభించారు. నూతన కోర్సు మానవ కేంద్రీకృత డిజైన్ విధానాలను నేర్పిస్తుంది. విద్య, వ్యాపారం, వ్యవసాయం, సహజ అభివృద్ధి వంటి విభిన్న రంగాల్లో వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినూత్న పరిష్కారాలు అందించే సరళమైన, శక్తివంతమైన పద్ధతులు నేర్చుకోవడానికి ఈ కోర్సు దోహదం చేస్తుంది. కార్యక్రమంలో అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం సీఈఓ సి.చంద్రమౌళి, కోఆర్డినేటర్ కృష్ణుడు, డాక్టర్ పి.జ్యోతి, బి.రాజశేఖర్ పాల్గొన్నారు.
నిందితులను
కఠినంగా శిక్షించాలి
కళ్యాణదుర్గం రూరల్: భర్త, అత్త మామల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన శ్రావణి మృతదేహం వద్ద వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం రంగయ్య మాట్లాడుతూ... భర్త శ్రీనివాసులు, అత్తమామలు తీవ్రంగా వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. భర్త, అత్త, మామలు టీడీపీ సానుభూతిపరులు కావడంతో పోలీసులు కేసును నీరుగారుస్తున్నారన్నారు. శ్రావణిది ఆత్మహత్య కాదని టీడీపీ నేతలు, పోలీసులు కలిసి హత్య చేశారని రంగయ్య ఆరోపించారు. శ్రావణి మృతి కారకులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, మండల కన్వీనర్లు గోళ్ల సూరి, హనుమంతురాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నేత రామాంజినేయులు. వైస్ ఎంపీపీ కాంతమ్మ, మల్లి, బిక్కి హరి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ‘అమర భారతం’
ప్రశాంతి నిలయం: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు దేశ స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను వివరిస్తూ ‘అమర భారతం’ పేరుతో ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది.

మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలు

మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలు

మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలు