
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం
అనంతపురం అర్బన్: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిద్దామని, సమష్టిగా పనిచేసి అగ్రస్థానంలో నిలుపుదామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురం పోలీసు పరేడ్ మైదానంలో జిల్లాస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలకు తన సందేశాన్ని వినిపించారు. వేడుకల్లో జిల్లా న్యాయమూర్తి భీమరావు, ఎంపీలు అంబికా లక్ష్మినారాయణ, పార్థసారథి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ వసీం సలీమ్, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎస్పీ పి.జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ప్రగతిని, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేద్దామని అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. పీ4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.