
సరిదిద్దుకుంటారా.. అలానే కానిచ్చేస్తారా?
అనంతపురం అర్బన్: ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా అవార్డులు ప్రదానం చేస్తారు. అయితే అవార్డులకు ఉద్యోగుల ఎంపిక క్రమంలో అధికారులు ప్రతిసారి విమర్శలకు తావిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఈ ఏడాది జనవరి 26న నిర్వహించిన గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఉద్యోగుల ఎంపిక తీరుపై అధికారులు తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు. తాజాగా ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవంలో అవార్డులు ప్రదానం చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ సారైనా విమర్శలకు తావివ్వకుండా ఎంపిక చేస్తారా.. అనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
సైటెర్లే సైటెర్లు..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా అప్పట్లో ఇష్టారీతిన అవార్డులకు ఎంపిక జరిగింది. మొత్తం 91 ప్రభుత్వ శాఖలకు సంబంధించి విశిష్ట సేవలు అందించిన 257 మంది ఉద్యోగులను ఎంపిక చేసినట్లు చూపించినా.. వాస్తవ రూపంలోకి వచ్చే సరికి ఈ సంఖ్య 278కి చేరడం గమనార్హం. రెవెన్యూ శాఖ పరిధిలో 82 మందిని ఎంపిక చేసినా సంఖ్యా పరంగా 63 మందిని చూపించారు. కలెక్టరేట్ ఉద్యోగులు 15 మంది, కలెక్టర్ క్యాంపు కార్యాలయం, జేసీ క్యాంపు కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేసే 36 మందిని ఎంపిక చేసి జాబితాలో 17 మందినే చూపించారు. కలెక్టర్, జేసీ క్యాంపు కార్యాలయంలో పనిచేసే తోటమాలీలు, డ్రైవర్లు, అటెండర్లు, వాచ్‌మెన్‌లకూ అవార్డులు ఇవ్వడం అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. దీనికితోడు జిల్లాలో 91 ప్రభుత్వ శాఖలు ఉంటే కేవలం రెవెన్యూ శాఖ, పోలీసు శాఖకు సంబంధించే 103 మందికి అవార్డులిచ్చారు. మిగిలిన వాటిల్లో శాఖకు ఒకరూ, ఇద్దరు, ముగ్గురు ఇలా 154 మందిని ఎంపిక చేయడంపైనా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అప్పట్లో దీనిపై ఉద్యోగులు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ‘వడ్డించే వాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఓకే ’ అంటూ సైటెర్లు పేల్చారు. ఈ క్రమంలో ఈ సారి అలాంటి తప్పులు పునరావృతం కానివ్వొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.