
మద్యంలో మునిగితేలుతున్నారు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. ఊరూరా వెలసిన బెల్టుషాపులు మద్యాన్ని ఇంటింటికీ సరఫరా చేసే స్థాయికి చేరాయి. నగరంలో వైన్‌షాపులు సమయం ప్రకారమే నడుచుకోవాలి. కానీ బెల్టుషాపులకు సమయమూ సందర్భమూ ఏమీ లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందిస్తారు. పల్లెల్లో ప్రస్తుతం ఏదైనా బాగా అందుబాటులో ఉందీ అంటే అది మద్యమేననే విమర్శలు వినిపిస్తున్నాయి.
కూరగాయల షాపుల కంటే ఎక్కువ
సాధారణంగా ఊరికి రెండు, మూడు కూరగాయల షాపులు.. మండల కేంద్రాల్లో అయితే పదిహేను, ఇరవై వరకూ అందుబాటులో ఉంటాయి. కానీ రాప్తాడు నియోజకవర్గంలోని 1,500 జనాభా ఉండే బండమీదపల్లెలో 15 నుంచి 20 వరకూ బెల్టుషాపులున్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాల వ్యాన్‌లు ఎలా అయితే షాపులకు పాలు వేస్తూ వెళతాయో అదే తరహాలో బెల్టుషాపులకు మందు సరఫరా చేయడానికి వ్యాన్‌లు ఏర్పాటు చేశారు. కదిరి, ధర్మవరం నియోజకవర్గాల్లో ఏ ఊరికెళ్లినా పట్టపగలే రోడ్డుమీద మద్యం పెట్టి అమ్ముతున్న దృశ్యాలు కనిపిస్తాయి.
రూ.1,550 కోట్ల వినియోగం..
2024 సెప్టెంబర్ 15న కొత్త మద్యం పాలసీ వచ్చింది. అప్పటినుంచి ఈరోజు వరకూ అంటే 11 నెలల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూ.1,550 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందంటే ఎలా తాగుతున్నారో అంచనా వేయొచ్చు. ఈ 11 నెలల్లో 1.97 కోట్ల లీటర్ల మద్యం సేవించారు. బీర్ల సేవనం దీనికి అదనం. పట్టణాల్లో అయితే పర్మిట్ రూముల్లో మందుబాబులు మద్యంలో మునిగి తేలుతున్నారు.
మామూళ్లు మద్దయ్యకు తెలిసే..
మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇందుకు నెలనెలా ఎకై ్సజ్ అధికారులకు మామూళ్లు వెళుతున్న విషయం తెలిసిందే. ఇదంతా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్(డీసీ) నాగమద్దయ్యకు తెలిసే జరుగుతోందని ఒక ఎక్సైజ్ అధికారి చెప్పారు. ‘మామూళ్ల సంగతి కిందిస్థాయి కాని స్టేబుల్‌కే తెలిసినప్పుడు డీసీకి తెలియకుండా ఉంటుందా?’ అనే చర్చ జరుగుతోంది. దీనిపై డీసీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
నెలనెలా పెరుగుతూనే ఉన్న వినియోగం
పల్లె పల్లెనా విచ్చలవిడిగా బెల్టుషాపుల ఏర్పాటు
11 మాసాల్లో రూ.1,550 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు
1.98 కోట్ల లీటర్ల మద్యం సేవనం

మద్యంలో మునిగితేలుతున్నారు!