
వీడని బాధ్యతారాహిత్యం
అనంతపురం మెడికల్: ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న జిల్లా వైద్య రంగంలో ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం ప్రజలకు శాపంగా మారింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, బోధనాస్పత్రిలో కీలక అధికారులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన పలువురు ప్రజారోగ్యం జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు పట్టడం లేదని విమర్శలు చేస్తున్నారు.
నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం
జిల్లా కేంద్రంలో గతంలో సీజ్ చేసిన ప్రైవేట్ ఆస్పత్రిని అనధికారికంగా తెరిచి రోగులకు చికిత్సలు అందజేస్తున్నా.. డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబదేవి స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోతే తప్ప డీఎంహెచ్‌ఓ మేల్కోనకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ నాయక్.. లావణ్య పేరుపై తన ఆస్పత్రిలో ఓ మహిళకు చేసిన శస్త్రచికిత్స విఫలం కావడంతో ఏడాది క్రితమే కలెక్టర్ ఆదేశాలతో ఆ ఆస్పత్రిని డీఎంహెచ్‌ఓ సీజ్ చేశారు. తన భార్య డెంటల్ వైద్యురాలని, ఆ ఆస్పత్రిని తెరుచుకుంటానని తరచూ ఆరోగ్యశాఖ కార్యాలయం చుట్టూ డాక్టర్ రమణ నాయక్ అప్పట్లో తిరిగారు. ఆ తర్వాత మూతపడిన లావణ్య ఆస్పత్రిని తెరిచి శ్రీకృప పేరుతో నడిపారు. ఇటీవల బీకేఎస్ మండలం చెదళ్లకు చెందిన గర్భిణి రాధమ్మ(29) ప్రాణం పోయాక మూత పడిన ఆస్పత్రిని తెరిచిన వైనం వెలుగు చూసింది. పర్యవేక్షణ మరచిన డీఎంహెచ్‌ఓ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం తీరూ ఇష్టారాజ్యంగా మారిందనే విమర్శలున్నాయి. గత నెలలో తాను నిర్వహిస్తున్న మేడా నర్సింగ్ హోంలో అడ్మిట్ చేసుకున్న ఉరవకొండ ప్రాంతానికి చెందిన రాజేష్ అనే 22 ఏళ్ల యువకుడిని తర్వాత జీజీహెచ్‌లో చేర్పించి చికిత్స అందజేయించారు. అయితే ఆ యువకుడి మృతితో కుల సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఇటీవల జీజీహెచ్‌లో స్ట్రెచర్ అందుబాటులో లేక బెళగుప్ప తండాకు చెందిన మధునాయక్(23) మృతి చెందిన విషయం కలకలం రేపింది. తన సొంత ఆర్థో విభాగానికి సంబంధించిన వైద్యులు పట్టపగలే విధులకు డుమ్మా కొడుతున్నా డాక్టర్ ఆత్మారాం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. బర్న్స్ వార్డును అనస్తీషియా విభాగానికి కేటాయించి విమర్శలకు తావిచ్చారు. ప్రధానంగా ఆస్పత్రిలో ఓ వైద్య విద్యార్థిని దోషిగా చేస్తూ ఆస్పత్రి గ్రూపులో ఏకంగా సదరు విద్యార్థి పేరును పోస్ట్ చేయడం కలకలం రేపింది. విద్యార్థి భవిష్యత్తును ఏ మాత్రం ఆలోచించకుండా పేరును ప్రస్తావించి పరువు తీయడం ఎంత వరకు సమంజసమని వైద్య విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
అనంతపురంలోని సర్వజనాస్పత్రి
ప్రిన్సిపాల్ తీరూ అంతంతే
ఇటీవల అనంతపురం మెడికల్ కళాశాల (ఏఎంసీ) ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ షారోన్ సోనియా పనితీరు కూడా అంతంత మాత్రమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బోధనాస్పత్రి వైద్యులు కనీసం సమయపాలన పాటించేలా కూడా ఆమె చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రోజూ ఉదయం 9 గంటలకు బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిన వైద్యులు.. అలా వచ్చి తమ వాహనాలు కూడా దిగకుండా వైద్య కళాశాల ఎదుటనే తమ మొబైల్‌లో బయోమెట్రిక్ అటెండెన్స్ వేసి వెళ్లిపోతున్నారు. అనంతరం వారికి తీరికై నప్పుడు విధులకు హాజరవుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన ప్రజలు.. జిల్లా వైద్య రంగాన్ని బాగుపరిచేవారెవ్వరూ లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఆరోగ్య శాఖ, బోధనాస్పత్రిలో అధికారుల ఇష్టారాజ్యం
సీజ్ చేసిన ఆస్పత్రిని తెరిచినా
నిద్ర వీడని డీఎంహెచ్‌ఓ
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న
జీజీహెచ్ సూపరింటెండెంట్
ప్రొఫెసర్లు విధులకు డుమ్మా కొడుతున్నా పట్టించుకోని ఏఎంసీ ప్రిన్సిపాల్
మంత్రి సత్యకుమార్‌కు పట్టని ప్రజారోగ్యం