
ఉన్న వాటితో ఉచిత బస్సు సాధ్యమేనా?
అనంతపురం క్రైం: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ కూటమి సర్కారు హడావుడిగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆ సంస్థ అధికారులు, సిబ్బందిని హడలెత్తిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా నిత్యం 511 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. సగటున 1.20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సంస్థకు సుమారు రూ.80 లక్షల ఆదాయం చేకూరుతోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలైతే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుంది. అయితే, అందుకు అనుగుణంగా సర్వీసులు లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు టెన్షన్‌కు గురవుతున్నారు. అనంతపురం రీజియన్‌కు కనీసం మరో 300 బస్సులు ఇవ్వగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆర్టీసీ సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
బస్సుల్లేవ్.. సిబ్బంది కొరత
ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి క్షేత్రస్థాయిలో కూటమి సర్కారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అదనంగా బస్సుల కొనుగోలు, సిబ్బంది సంఖ్య పెంపు, వాహన సారథుల ఎంపిక చేపట్టనేలేదు. ఇప్పటికే కాలం చెల్లిన బస్సులకు మరమ్మతులు చేయలేక గ్యారేజీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. గ్యారేజీలో తగినంత మంది లేక అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అంటుండడంతో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
ఎర్రబస్సెరుగని గ్రామాలు 120కి పైగానే..
జిల్లాలో ఇప్పటి దాకా ఎర్రబస్సెరుగని గ్రామాలు 120కి పైగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆటోలు, ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. ఉచిత బస్సు పథకం అమలులోకి వస్తే నష్టాల కారణంగా ఆయా గ్రామాలకు ప్రైవేటు వారు వెళ్లరు. ఈ క్రమంలో తమ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడపాల్సిందే అంటూ ఆయా గ్రామాల ప్రజలు తిరుగుబాటుకు దిగే అవకాశం లేకపోలేదు. ఈ విషయంపైనా ఆర్టీసీ అధికారులు, సిబ్బందిలో ఆందోళన నెల కొంది. సర్కారు పెద్దలెక్కడో ఉంటారని, క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తితే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు.
ఊపిరి పోసిన వైఎస్ జగన్..
ఆర్టీసీని నష్టాల బారి నుంచి బయట పడేసేందుకు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఉద్యోగులకు జీతాలు, అలవెన్సులకు నెలకు రూ. 300 కోట్లు అవసరమని గుర్తించి ఏడాదికి రూ. 3,600 కోట్ల భారం పడినా మాటకు కట్టుబడ్డారు. పెద్ద మొత్తంలో సంస్థకు భారం తగ్గించడంతో ఆర్టీసీ కొంత మేర ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలోనే కూటమి సర్కారు ఉచిత బస్సుకు తెరతీయడంతో మళ్లీ ఆర్టీసీ అగాథంలోకి పడిపోతుందని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.