
నిండా ముంచిన వర్షాలు
కణేకల్లు/బొమ్మనహాళ్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కణేకల్లు మండలంలోని ఎన్.హనుమాపురం, సొల్లాపురం, హనకనహళ్ గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి నాగేపల్లి వంకకు భారీగా వరద వచ్చింది. ఈ క్రమంలోనే వంక పక్కనే ఉన్న గరుడచేడు రైతుల వేరుశనగ పంట పొలాల్లోకి నీరు చేరాయి. పొలాలు చెరువుల్లా మారాయి. 15 రోజుల్లో పంట చేతికొస్తుందనుకుంన్న నేపథ్యంలో ఇలా జరగడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సుమారు 200 ఎకరాల్లో పంట దెబ్బతిందని చంద్రశేఖర్, కురుబ వెంకటేశులు, కురుబ కాడెప్ప, గోపాల్, వెంకటరాముడు, బెస్త గోవిందరాజులు, గంగాధర, కృష్ణతోపాటు మరో 30 మంది వాపోయారు. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదని విలపిస్తున్నారు.
● బొమ్మనహాళ్ మండలంలోని దేవగిరి క్రాస్‌కు చెందిన పరమేశ్వరప్ప అనే కౌలు రైతు 6 ఎకరాల్లో బోరు కింద వేరుశనగ పంట సాగు చేశాడు. ఎకరాకు రూ.60 వేలకు పైగా పెట్టుబడి పెట్టాడు. ఇటీవల వేరుశనగ చెట్లు పీకి పొలంలో ఆరబెట్టాడు. అయితే, ఇదే సమయంలో నాలుగు రోజులుగా వర్షం కురుస్తుండడంతో పొలంలో నీరు నిలిచి వేరుశనగ కాయలకు మొలకలు వచ్చాయి. దీంతో పరమేశ్వరప్ప లబోదిబోమంటున్నాడు. కాయలు బూజుపట్టి, పశుగ్రాసం కూడా దక్కలేని పరిస్థితి ఉందని వాపోయాడు. రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
28 మండలాల్లో వాన
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 28 మండలాల పరిధిలో 5.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరు 21 మి.మీ, గుంతకల్లు 20.2 మి.మీ నమోదు కాగా మిగతా మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షపాతం కురిసింది. కాగా రాగల రెండు రోజులూ జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

నిండా ముంచిన వర్షాలు