
ప్రిన్సిపాల్‌గా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి!
● గిరిజన గురుకులంలో వింత పోకడ
● బాధ్యతలు అప్పగించిన గిరిజన సంక్షేమ శాఖ అధికారి
ఉరవకొండ: గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వింత పోకడలకు తావిస్తూ గురుకుల పాఠశాలల్లో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. వజ్రకరూరు మండలం రాగులపాడులోని ప్రభుత్వ గిరిజన బాలుర గురకుల పాఠశాలనే ఇందుకు నిదర్శనం. ఈ పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌బాబు ఇటీవల మెడికల్ లీవ్‌లోకి వెళ్లారు. ఆ స్థానంలో ఇన్‌చార్జ్‌గా సమీప గురుకులానికి చెందిన ప్రిన్సిపాల్‌కు లేదా అదే పాఠశాలలోని రెగ్యులర్ సీనియర్ ఉపాధ్యాయుడికి అప్పగించాలల్సి ఉంది. నిబంధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇందుకు విరుద్ధంగా ఆ పాఠశాలలో ఔట్‌సోర్సింగ్ కింద తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాల్యానాయక్‌కు అప్పగించడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తినా.. గురుకులంలో విద్యార్థులకు ఏదైనా జరగరానిది జరిగినా బాధ్యత ఎవరు వహిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావును వివరణ కోరగా.. రెగ్యులర్ ఉద్యోగులు దొరకడం లేదని, వారం రోజుల్లో రెగ్యులర్ ఉద్యోగికి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
డ్రైనేజీలో పడి చేనేత కార్మికుడి మృతి
ధర్మవరం: పట్టణంలోని శ్రీదేవి థియేటర్ వద్దనున్న డ్రైనేజీలో పడి ఓ చేనేత కార్మికుడు మృతిచెందాడు. వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని పేట బసవన్నకట్టవీధికి చెందిన సపారు నాగరాజు(60) పట్టుచీరలను మడతలు వేసేందుకు వెళుతుంటాడు. ఐదేళ్ల క్రితం భార్య మృతి చెందింది. అప్పటి నుంచి మద్యానికి అలవాటుపడ్డాడు. ఆదివారం రాత్రి మద్యం సేవించి శ్రీదేవి థియేటర్ సమీపంలో గ్రంథాలయం ఎదురుగా మురుగు కాలువలో పడిపోయాడు. రాత్రి వర్షం ఎక్కువగా రావడంతో కాలువలో నీటి ప్రవాహం ఎక్కువైంది. సోమవారం ఉదయం పారిశుధ్య కార్మికులు కాలువను శుభ్రం చేస్తుండగా మృతదేహం కనిపించడంతో బయటకు తీశారు. స్థానికులు గుర్తించి మృతుని కుమారుడు మనోహర్‌కు సమాచారం అందించారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
నేడు విద్యుత్ అదాలత్
అనంతపురం టౌన్: విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురంలోని పాతూరులో ఉన్న విద్యుత్ కార్యాలయ ఆవరణలో విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ ఈఈ జేవీ రమేష్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురం డివిజన్ పరిధిలోని గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, అనంతపురం, కూడేరు, ఆత్మకూరు, నార్పల, శింగనమల మండలాల్లోని రైతులు, విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను విన్నవించి, పరిష్కరించుకోవచ్చు.