
జేబుకు అధనపు చిల్లు
అనంతపురంలోని హౌసింగ్ బోర్డు ఎక్స్‌టెన్షన్‌లో నివాసముంటున్న విజయకుమార్ వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేశారు. సిలిండర్ ధర రూ.920 కాగా, డెలివరీ బాయ్‌కు రూ.1,000 ఇస్తే చిల్లర ఇవ్వలేదు. ఎప్పుడూ అదనంగా రూ.30 కదా తీసుకునేది ఇప్పుడేంది రూ.80 తీసుకుంటున్నావు అని ప్రశ్నించాడు. ఇద్దామంటే చిల్లర లేదు అని బాయ్ చెప్పాడు. అయితే ఫోన్ పే చేస్తా.. ఆ డబ్బు వెనక్కి ఇవ్వు అని విజయకుమార్ అనడంతో బాయ్ మారుమాట్లాడకుండా రూ.50 వెనక్కి ఇచ్చాడు. అప్పటికే అదనంగా రూ.30 తీసుకున్న బాయ్ చిల్లర లేదనే సాకుతో మరో రూ.50 నొక్కేందుకు సిద్ధపడ్డాడు. సిలిండర్ డెలివరీ క్రమంలో దాదాపు అందరు వినియోగదారుల పరిస్థితి ఇలాగే ఉంటోంది.
● గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్‌ల నిర్వాకం
● సిలిండర్ ధరపై ఆదనంగా రూ.30 వసూలు
● జిల్లాలో రోజు వారీగా 12 వేల సిలిండర్ల డెలివరీ
● అదనంగా రూ.30తో రోజువారీ వసూలు రూ.3.60 లక్షలు
● నెలసరి అదనపు వసూళ్లు రూ.1.08 కోట్లు
అనంతపురం అర్బన్: ‘వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ క్రమంలో నిర్ణీత ధరకు మించి అదనంగా డబ్బు వసూలు చేయడం నేరం. అలా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ గ్యాస్ ఏజెన్సీలను జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ పలుమార్లు హెచ్చరిస్తూ ప్రకటనలు జారీ చేసినా ఏజెన్సీ యాజమాన్యంలో కానీ డెలివరీ బాయ్స్‌లో కానీ మార్పు రావడం లేదు. సిలిండర్ డెలివరీ చేసే క్రమంలో వినియోగదారుల నుంచి నికర ధరపై అదనంగా రూ.30 ఖరాఖండీగా వసూలు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా రూ.50 కూడా వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క సిలిండర్‌పై అదనంగా రూ.30 అనేది చూసేందుకు చిన్న మొత్తంగా కనిపిస్తుంది. అయితే జిల్లావ్యాప్తంగా రోజువారీగా డెలివరీ అవుతున్న సిలిండర్లపై అదనపు వసూలు మొత్తం లెక్కగడితే ఆశ్చర్యపోక తప్పదు. జిల్లావ్యాప్తంగా 50 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 7,65,246 గృహవసర వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వినియోగదారులకు రోజువారీగా జిల్లావ్యాప్తంగా దాదాపు 12 వేల సిలిండర్లు డెలివరీ అవుతుంటాయి. ఈ లెక్కన నెలకు 3.60 లక్షల గ్యాస్ సిలిండర్లను వినియోదారులకు డెలివరీ చేస్తుంటారు. ఒక్కొక్క సిలిండర్ నుంచి రూ.30 చొప్పున అదనంగా తీసుకున్నా.. నెలకు రూ.1.08 కోట్లు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. గృహవసర వంట గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.920 ఉంది. అయితే సిలిండర్‌ఽ నికర ధరతో సంబంధం లేకుండా ఒక్కొక్క సిలిండర్ బిల్ పై వినియోగదారుల నుంచి డెలివరీ బాయ్స్ రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు. కొందరి వద్ద నుంచి ఏకంగా రూ.50 వరకు వసూలు చేస్తున్న సందర్భాలూ ఉన్నాయి.
అదనం ఇవ్వకపోతే తిప్పలే
సిలిండర్ ధరపై బాయ్స్‌కు అదనపు సొమ్ము రూ.30 ఇవ్వకపోతే వినియోదారులకు తిప్పలు తప్పవు. సిలిండర్ మంజూరైనా డెలివరీ చేయరు. డోర్ లాక్ అని చెప్పి ఏజెన్సీలో సిలిండర్‌ను వెనక్కి ఇచ్చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల సిలిండర్ బుకింగ్ రద్దవుతుంది. దీంతో మరోమారు వినియోదారుడు బుక్ చేయాలి. ఇలా రెండు మూడు దఫాలు ఇబ్బందికి గురిచేస్తారు. దీంతో ఈ తిప్పలు పడలేక వినియోదారులు తప్పని పరిస్థితిలో సిలిండర్‌పై అదనపు మొత్తాన్ని ఇచ్చుకుంటారు. అలాంటి పరిస్థితిని డెలివరీ బాయిస్ కల్పిస్తుండడం గమనార్హం.

జేబుకు అధనపు చిల్లు