
7 లారీల బియ్యం స్వాధీనం
యాడికి: అక్రమంగా రైస్ మిల్లులో నిల్వ చేసిన టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు యాడికి తహసీల్దార్ ప్రతాపరెడ్డి, సీఐ ఈరన్న తెలిపారు. వివరాలను సోమవారం వారు వెల్లడించారు. యాడికిలోని పెద్దపేటకు పోతున్న మార్గంలో ఉన్న బలరాముడు రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లుగా తెలుసుకున్న అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని గుర్తించిన అధికారులు వెంటనే విషయాన్ని తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి దృష్టికి తీసుకెళ్లి భద్రత కల్పించాలని కోరారు. దీంతో ఆయన ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్నారు. 50 కిలోల చొప్పున ఒక్కో బస్తాలో నింపి ఒక్కో లారీలో 30 నుంచి 32 టన్నుల వరకు హమాలీల ద్వారా లోడ్ చేయించారు. మొత్తం ఏడు లారీల్లో 215 టన్నుల రేషన్ బియ్యాన్ని గుంతకల్లులోని స్టాక్ పాయింట్‌కు తరలించినా... ఇంకా మిగులు ఉంది. ఈ బియ్యాన్ని కూడా స్టాక్ పాయింట్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఎం.రమణయ్య, డీటీ శ్రీనివాసులు, సీఎస్‌డీటీ మల్లేసు, వీఆర్‌ఓలు, సచివాలయ సిబ్బంది, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
ఐదుగురిని కరిచిన పిచ్చికుక్క
ఉరవకొండ: స్థానిక కవితా హోటల్ సర్కిల్ వద్ద ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ ఐదుగురిని కరిచి గాయపరిచింది. గాయపడిన వారిలో పొట్టిపాడు గ్రామానికి చెందిన రాము, చిన్నముష్టూరుకు చెందిన ఓబులేసు, నారాయణ, హోతూరు నివాసి రామాంజినేయులు, ఉరవకొండ పట్టణానికి చెందిన రాము ఉన్నారు. వీరంతా స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందారు.