
స్టాప్‌లో బస్సు ఆపలేదని గొడవ
కళ్యాణదుర్గం/అనంతపురం క్రైం: చెయ్యెత్తినా.. బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో డ్రైవర్‌తో ఓ ప్రైవేట్ ఉద్యోగిని గొడవ పడింది. మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సుచరిత అనే ప్రైవేట్ ఉద్యోగిని అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వచ్చేందుకు సిద్ధమై అనంతపురం నడిమి వంక బస్టాఫ్ వద్ద వేచి ఉండగా ఆర్టీసీ అద్దె బస్సు అటుగా వచ్చింది. ఆమె చెయ్యెత్తినా డ్రైవర్ ఆపకుండా నిర్లక్ష్యంగా ముందుకు వెళ్లిపోయాడు. అత్యవసరం కావడంతో సదరు మహిళ కుమారుడి సహకారంతో ద్విచక్ర వాహనంపై బస్సును అనుసరిస్తూ ఓవర్‌టేక్ చేసి ఆపి ఎక్కింది. చెయ్యేత్తినా బస్సు ఎందుకు ఆపలేదంటూ డ్రైవర్‌ను నిలదీయడంతో అతను నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి విషమించింది. చివరకు ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.ఈ అంశాన్ని చిత్రీకరించిన ప్రయాణికుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంతో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ నిర్వాకం వెలుగు చూసింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని నెటిజన్లు మండిపడ్డారు.