అనంతపురం అర్బన్: మాతాశిశు మరణాలకు తావివ్వరాదని సంబంధిత అధికారులను ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ ఆదేశించారు. మాతాశిశు మరణాల అంశంపై కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. ఈ త్రైమాసికంలో జిల్లాలో చోటు చేసుకున్న నాలుగు మాతృ మరణాలకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. కూడేరు, నాగసముద్రం, విడపనకల్లు, ఆంబేడ్కర్ నగర్ పీహెచ్‌సీలో జరిగిన మాతృ మరణాలపై ఆయా ప్రాంతాల ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల నుంచి వివరణ తీసుకున్నారు. మరణానికి ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, మరణానికి కారణాలు తెలుసుకోవాలన్నారు. మరోసారి అలాంటి కారణాలతో ఇంకో మరణం జరగకుండా వైద్యులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాతృ మరణాల నివారణకు పర్యవేక్షక సిబ్బంది సరైన చర్యలు తీసుకోవాలన్నారు. రక్తహీనత, గుండె సంబంధిత సమస్యలు, బరువు, ఎత్తు తక్కువ, తల్లి గర్భంలో ఉమ్మునీరు తక్కువగా ఉన్నా, బిడ్డ పెరుగుదల లేకపోయినా, హైరిస్క్ గర్భిణులను గుర్తించి ప్రత్యేక వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. శిశు మరణాల విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, వ్యాధి నిరోధక టీకాల అధికారి యుగంధర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
పశుశాఖ ఇన్‌చార్జి జేడీగా డాక్టర్ సుధాకర్
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధఖశాఖ ఇన్‌చార్జి జేడీగా మరోసారి డాక్టర్ టీవీ సుధాకర్‌ను నియమిస్తూ ఆ శాఖ డైరెక్టరేట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ 30న ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ జీపీ వెంకటస్వామి స్థానంలో అప్పటి డీఎల్‌డీఏ ఈఓగా ఉన్న సుధాకర్‌కు ఎఫ్‌ఏసీ జేడీగా బాధ్యతలు అప్పగించారు. ఫారిన్ సర్వీసు కింద పనిచేస్తున్న డీఎల్‌డీఏ ఈఓ పోస్టు గడువు జూలై 15తో ముగిసింది. దీంతో ఆయన సెలవులో వెళ్లి వారం రోజుల తర్వాత పశుశాఖలో ఉరవకొండ డీడీ పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఇటీవల అనంతపురం డీడీగా ఉన్న డాక్టర్ వై.రమేష్‌రెడ్డిని ఇన్‌చార్జ్ జేడీగా నియమిస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇన్‌చార్జ్ పోస్టు నిర్వర్తించలేనంటూ రమేష్‌రెడ్డి విన్నవించారు. ఈ క్రమంలో మరోసారి డాక్టర్ టీవీ సుధాకర్‌కు ఇన్‌చార్స్ బాధ్యతలు అప్పగించారు. బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.