
ఉప ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీ విఫలం
అనంతపురం కార్పొరేషన్: పులివెందుల, ఒంటి మిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) విఫలమైందని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. ఆయా ప్రాంతాల్లో రీ పోలింగ్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారన్నారు. వారిని కట్టడి చేయాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని విమర్శించారు. భవిష్యత్తులో చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం, ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయన్నారు. సాక్షాత్తు పోలీసులే దగ్గరుండి గూండాలతో ఓట్లు వేయించేలా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడ్డారని, ఇంతకన్నా దారుణమైన పరిస్థితులను ఎక్కడా చూడలేదని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి ఎన్నికలను చూడలేదన్నారు. వైఎస్సార్ సీపీ గెలుపును అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు అండ్ కో దిగుజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. పోలింగ్ బూత్‌లను ఒక ఊరి నుంచి మరో ఊరికి మార్చడం, తమ పార్టీకి చెందిన ఏజెంట్లను బూత్‌ల నుంచి తరిమేయడం, వైఎస్సార్ సీపీ నాయకులను బైండోవర్లు, హౌస్ అరెస్టులు చేయడంతో పాటు పోలింగ్ బూత్‌ల వద్దకు ఎవరైనా వస్తే దాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. టీడీపీ గూండాలు మారణాయుధాలతో రెచ్చిపోతూ ఓటర్లను అడ్డుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఏమాత్రమూ పట్టించుకోకుండా చోద్యం చూశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోవచ్చు కానీ ఎల్లకాలం ఇవే విధానాలు నడుస్తాయని అనుకోవడం అవివేకమని ఆయన హెచ్చరించారు.
పోలీసులే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం దారుణం
మాజీ మంత్రి సాకే శైలజానాథ్