
25 మండలాల్లో వర్షం
● వారం రోజుల్లోనే
134 మి.మీ వర్షపాతం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 25 మండలాల పరిధిలో 12.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. వజ్రకరూరు 42.4 మి.మీ, కూడేరు 35.2, బెళుగుప్ప, ఆత్మకూరు 32.8, ఉరవకొండ 32.2, బుక్కరాయసముద్రం 28.2, అనంతపురం 20.4 మి.మీ నమోదు కాగా మిగతా మండ లాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆగస్టు సాధారణ వర్షపాతం 83.8 మి.మీ కాగా ఇప్పటికే 134.4 మి.మీ వర్షం పడింది. ఓవరాల్‌గా జూన్ ఒకటి నుంచి 154.8 మి.మీ గానూ 40 శాతం అధికంగా 217 మి.మీ నమోదైంది. 13 వర్షపు రోజులు (రెయినీడేస్) రికార్డయ్యాయి. వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 134 మి.మీ సగటు నమోదు కావడం విశేషం.
పేలుడు పదార్థాల డంప్‌పై సమగ్ర దర్యాప్తు
అనంతపురం: జిల్లాలోని ఆత్మకూరు మండలం వేపచర్ల సమీపంలోని కొండగుట్ట ప్రాంతంలో లభ్యమైన పేలుడు పదార్థాల డంప్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. డంప్‌ను ఇప్పటికే సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డిటోనేటర్లు, 9 ఎంఎం రౌండ్స్, ఐరన్ బాల్స్, వైట్ రబ్బర్ ఎంప్టీ కాక్, ఫోర్ డ్యూరేసెల్ ప్లస్, ప్లాస్టిక్ స్పింగ్, ఇయర్ ఫోన్స్, మిర్రర్, స్టాంప్లర్, రెడ్ కలర్ బకెట్, లిబరల్ హై, నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోస్ (పూర్తిగా చిత్రం కనిపించలేదు) ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, పోలీసులకు లభించిన పేలుడు పదార్థాలు 2000–2005 కాలం నాటివిగా అంచనా వేస్తున్నారు. డంప్ మావోయిస్టులకు చెందిందా.. లేక ఫ్యాక్షనిస్టులదా అనే అంశాలపై లోతుగా విచారణ చేపడుతున్నారు. ఆత్మకూరు మండలంలో గతంలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండేది.
జిల్లాలో అవినీతి రాజ్యం
● అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే
వసూళ్ల దందా సాగిస్తున్నారు
● చివరికి బుడబుక్కల వాళ్లనూ
వదలడం లేదు
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం
అనంతపురం అర్బన్: జిల్లాలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఇసుక, మట్టి దోపిడీ అడ్డూ అదుపు లేకుండా సాగుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాప్రతినిధులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంగళవారం అనంతపురంలో జరిగిన సీపీఐ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా నాయకులు, కార్యకర్తలతో కలసి స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి కేఎస్‌ఆర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వసూళ్ల దందా సాగిస్తున్నారన్నారు. భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. చివరికి బుడబుక్కల వాళ్లను సైతం విడిచిపెట్టకుండా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. వీరి అవినీతి గురించి వేరే పార్టీ వాళ్లు కాదని.. సొంత పార్టీ వారే చెబుతున్నారన్నారు. గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు కానీ.. అనంతపురం చరిత్రలోనే ఇంత అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యే ఎవరూ లేరని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజినేయులు,శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్, జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, నాయకులు రాజారెడ్డి, శ్రీరాములు, కేశవరెడ్డి, చిన్నప్పయాదవ్, పద్మావతి, జాన్సన్‌బాబు, రమణయ్య యాదవ్, రాజేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

25 మండలాల్లో వర్షం

25 మండలాల్లో వర్షం