
79 అడుగుల త్రివర్ణ పతాకం ప్రదర్శన
అనంతపురం: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ (సీయూఏపీ) ఆధ్వర్యంలో 79 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ఆదివారం అనంతపురంలో ప్రదర్శించారు. హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం కింద చేపట్టిన ఈ ర్యాలీని క్లాక్‌టవర్ వద్ద సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్‌ఏ కోరి ప్రారంభించి, మాట్లాడారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 79 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
గుత్తి: స్థానిక జీఆర్‌పీ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో రైలు కిందపడి ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి జీఆర్‌పీ పరిధిలోని ఓబులాపురం రైల్వే బ్రిడ్జి వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో జీఆర్‌పీ కానిస్టేబుల్ వాసు ఆదివారం అక్కడకు చేరుకుని పరిశీలించారు. శనివారం అర్ధరాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో శరీరం మూడు ముక్కలైంది. దీంతో గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య కింద తొలుత కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణలో మృతుడిని గుంతకల్లు మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ (32)గా గుర్తించారు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. మరో ఘటనలో పెద్ద వడుగూరుకు చెందిన సురేష్ (28) 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న గేట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఆదివారం పట్టాలపై చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, సురేష్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ రెండు ఘటనలపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
యువకుడి బలవన్మరణం
పరిగి: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పరిగి మండలం మోదా గ్రామానికి చెందిన సనావుల్లా కుమారుడు సయ్యద్ ముబారక్ (18) మెకానిక్ పని నేర్చుకుంటూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతుంటే కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. అయినా ఫలితం లేకపోయింది. ఆదివారం నొప్పి తీవ్రత తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.