
తలపై రాయిపడి యువకుడి మృతి
కళ్యాణదుర్గం రూరల్: నిద్రిస్తున్న యువకుడి తలపై రాయిపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్యాణదుర్గం మండలం మల్లాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వేణు, సునందమ్మ దంపతులు కరూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం ఇంటి ఆవరణలో నిద్రకు ఉపక్రమించారు. అర్థరాత్రి సమయంలో మిద్దైపె నుంచి ప్రమాదవశాత్తు రాయి నిద్రిస్తున్న వేణు తలపై పడడంతో తీవ్ర గాయమైంది. భార్య గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. అధిక రక్తస్రావంతో అప్పటికే వేణు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య
గుంతకల్లు: బీటెక్‌లో ఒక సబ్జెక్ట్ తప్పడంతో మనస్తాపం చెంది ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... కూడేరుకు చెందిన జాఫర్‌వలి కుమారుడు పి.మహమ్మద్ జావేద్ (18) గుత్తిలోని గేట్స్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గుంతకల్లులోని ద్వారాక నగర్‌లో నివాసముంటున్న బంధువుల ఇంట్లో ఉంటూ రోజూ కళాశాలకు వెళ్లి వచ్చేవాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినట్లుగా గుర్తించి మానసికంగా కుదేలయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 7 గంటలకు బయటకు వచ్చిన జావేద్ రాత్రి 9 గంటలవుతున్నా ఇంటికి చేరుకోలేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసిన జావేద్ లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే కుటుంబసభ్యులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జావేద్ సెల్‌ఫోన్ లోకేషన్ ఆధారంగా తిమ్మనచెర్ల రైల్వేస్టేషన్ సమీపంలో చేరుకుని పరిశీలించగా పట్టాలపై రెండుగా విడిపోయిన జావేద్ శరీర భాగాలు కనిపించాయి. ఘటనపై జీఆర్పీ ఎస్‌ఐ మహేంద్ర కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
యువకుడి దుర్మరణం
పామిడి: అతి వేగం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని అశోక్‌నగర్‌కు చెందిన శివకుమార్ కుమారుడు సుమంత్ (25) వ్యక్తిగత పనిపై గురువారం ఉదయం గుంతకల్లుకు వెళ్లాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన.. పామిడి గ్రామ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు చేరుకోగానే వేగాన్ని నియంత్రించుకోలేక నేరుగా వెళ్లి కల్వర్టు రక్షణ గోడను ఢీకొన్నాడు. ఘటనలో సుమంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

తలపై రాయిపడి యువకుడి మృతి