
ఈపీఎఫ్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
అనంతపురం సిటీ: స్తానిక రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న ఈపీఎఫ్ కార్యాలయం వద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. బకాయి వేతనాలు పీఎఫ్ ఖాతాల్లో జమ చేయకుండా కాంట్రాక్టర్లు తప్పుడు ఆరోపణలు చేయడం, వారికి అధికారులు వత్తాసు పలుకడాన్ని నిరసిస్తూ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర నాయకత్వంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. తమకు చెల్లించాల్సిన వేతన బకాయిలతో పాటు పీఎఫ్ డబ్బులు తమ ఖాతాల్లో జమ చేయాలని నినాదాలు చేశారు. నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా అధికారులు, కాంట్రాక్టర్లు పరస్పరం నిందలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు అధికారులు తొత్తులుగా మారి పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల సంఘం అధ్యక్షుడు ఎర్రిస్వామి, కార్యదర్శి రాము, కోశాధికారి వన్నూరుస్వామి తదితరులు పాల్గొన్నారు.