అనంతపురం సెంట్రల్: ఫిట్‌నెస్ టెస్ట్ ప్రక్రియ వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ల అప్‌డేట్ నేపథ్యంలో సర్వర్లు తరచూ మొరాయిస్తుండడంతో వాహనదారులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. గత కొన్ని నెలలుగా అనంతపురం శివారులోని ప్రసన్నాయపల్లి జాతీయరహదారి వద్ద శివ శంకర్ ఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) నిర్వహిస్తున్నారు. గతంలో రవాణాశాఖ ఆధ్వర్యంలో వాహనాలకు ఫిట్‌నెస్ టెస్ట్‌లు నిర్వహించేవారు. జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయాల్లో కూడా ఈ పరీక్షలు జరిగేవి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతి జిల్లాలోనూ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. జిల్లాలో శివ శంకర్ ఎంటర్ ప్రైజెస్ టెండర్ దక్కించుకుంది.
సతాయిస్తున్న సర్వర్
వాహనాల ఫిట్‌నెస్ కోసం వందలాది వాహనాలు జిల్లా నలుమూలల నుంచి ఏటీఎస్ కేంద్రానికి వచ్చాయి. అయితే గత కొన్ని రోజులుగా సర్వర్ సరిగా పనిచేయడం లేదు. కొత్తగా ఆటోమేటెక్ ఫిట్‌నెస్ మేనేజ్‌మెంట్ (ఏఎస్‌ఎంఎస్) సాఫ్ట్‌వేర్ తీసుకొస్తుండడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. అయితే వాహనదారులకు సరైన సమాచారం లేకపోవడంతో ఏటీఎస్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. సదరు కేంద్రంలో సరైన సదుపాయాలు లేకపోవడం వలన వాహన యజమానులు, డ్రైవర్లు చెట్లకిందే సేద తీరుతున్నారు. ఫిట్‌నెస్ టెస్ట్‌కు స్లాట్ బుక్‌చేసుకున్న వారికి సమాచారమైనా ఇస్తే ఈ విధమైన పరిస్థితులు వచ్చేవి కావని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇబ్బందులు రాకుండా చర్యలు
దేశ వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి సర్వర్ సమస్య తలెత్తింది. ఏఎస్‌ఎంఎస్ సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నారు. శనివారంతో ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. సర్వర్ సమస్యను వాహనదారులకు తెలియజేస్తున్నాం. దీనివల్ల ఎక్కువమంది రావడం లేదు. దూరప్రాంతాల నుంచి కొంతమందే వచ్చారు. వాహనదారులకు ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం.
– నాగార్జునరెడ్డి, ఏటీఎస్ నిర్వాహకుడు
రెండురోజులుగా పనిచేయని సర్వర్
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వాహనాలు
ఏటీఎస్ వద్దే రోజంతా తప్పని పడిగాపులు
సహనానికి ఫిట్‌నెస్ పరీక్ష
సహనానికి ఫిట్‌నెస్ పరీక్ష


