పంటల్ని చూస్తే గుండె తరుక్కుపోతోంది
యల్లనూరు/పుట్లూరు: ‘ప్రకృతి వైపరీత్యాలతో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అన్నదాతల జీవితాలు అతలాకుతలమయ్యాయి. బాధిత రైతులను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కళ్లు మూసుకొని ఉంది’ అంటూ మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. మంగళవారం వారు యల్లనూరు, పుట్లూరు మండలాల్లో పర్యటించారు. కూచివారిపల్లి,బుక్కాపురం,తిమ్మంపల్లి,చింతకాయమంద, గొడ్డుమర్రి, దంతలపల్లి, నీర్జాంపల్లి, ఎల్లుట్ల, జంగంరెడ్డిపేట, మడ్డిపల్లి, కుమ్మనమల గ్రామాల్లో ఇటీవల ఈదురుగాలులకు దెబ్బతిన్న అరటి, బొప్పాయి పండ్ల తోటలు, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ రైతులు ఆర్తనాదాలు పెడుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను తొలగించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. రూ. లక్షలు పెట్టుబడి పెట్టిన అరటి పంటలు దెబ్బతింటే ఎకరాకు కేవలం రూ.14 వేలు ఇస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. అది కూడా తోట మొత్తం దెబ్బతిని ఉంటేనే పరిహారం ఇస్తామనడం అన్యాయమని, ఎకరాకు 1,300 అరటి చెట్లు సాగు చేస్తే గాలులకు 1,000 చెట్ల దాకా నేలకొరిగాయని, ఇంకా 300 చెట్లున్నాయంటూ పరిహారం ఇవ్వరా అని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే నీర్జాంపల్లికి చెందిన రైతులు ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. త్వరలో తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి రైతులను ఆదుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. విజయవాడ కమిషనరేట్‌లో డిల్లీరావుతో ప్రత్యేకంగా సమావేశమై న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి వంశీ గోకుల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, పార్టీ మండల కన్వీనరు వెంకటేష్‌నాయుడు, సర్పంచులు నారాయణస్వామి, ప్రభాకర్‌రెడ్డి, జమాల్, పెద్దనాగరాజు, నాయకులు మహేశ్వరరెడ్డి, నాగేశ్వరరెడ్డి, శింగనమల ప్రసాద్, సూర్యనారాయణరెడ్డి, శేఖర్, ఈశ్వరరెడ్డి, విష్ణు నారాయణ, సుబ్బయ్య, సూరీ, పురుషోత్తంనాయుడు, కిరణ్, శంకర్‌రెడ్డి, రవి, జనార్దన్, బాలవెంకటరెడ్డి, రాజకుళ్లాయిరెడ్డి, రమణ, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు సర్కారు తీరుతో అన్నదాతల జీవితాలు అతలాకుతలం
వైఎస్సార్ సీపీ నేతలు
శైలజానాథ్, కేతిరెడ్డి పెద్దారెడ్డి
యల్లనూరు, పుట్లూరు మండలాల్లో దెబ్బతిన్న పంటల పరిశీలన


