ఉరవకొండ: ఓ సినిమాలో అమాయకుల నుంచి బంగారు మూటను కమెడియన్ కొట్టేస్తారు. తన సహచరులతో కలిసి నగల పంపకాలకు కూర్చుంటారు. ‘నీకు... నాకు..’ అంటూ అందరూ పంచుకుంటుండగా.. హీరో ఎంట్రీ ఇచ్చి అందరి పని పడతాడు. అచ్చం ఇలాగే.. పెన్నహోబిలం పుణ్యక్షేత్రంలో ఓ ఘటన జరిగింది. అయితే, ఇక్కడ మాత్రం ఇంటి దొంగలే దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. లక్షలాది మంది ఇలవేల్పుగా కొలుచుకునే సాక్షాత్తూ నారసింహుడి ఆలయంలోనే చోటుచేసుకున్న ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. వివరాలు.. ఉరవకొండ మండల పరిధి లోని ఆమిద్యాల గ్రామానికి చెందిన వేలూరు రంగయ్య, వనజాక్షి దంపతులు ఈనెల 7న పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కు మేరకు వనజాక్షి తన ఒంటిపై ఉన్న బంగారు నగలన్నీ మూటకట్టి హుండీ ద్వారా స్వామి వారికి సమర్పించింది. ఆమె ఆభరణాలు హుండీలో వేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ అర్చకుడితో పాటు ఆలయ సిబ్బంది గమనించారు. ఈనెల 18న ఆలయ ఈఓ సాకే రమేష్‌బాబు ఆధ్వర్యంలో స్వామి వారి శాశ్వత హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించగా... నగల మూటను చాకచక్యంగా మాయం చేశారు. హుండీ లెక్కింపు పూర్తయ్యాక పంచుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే ఓ గదిలో కూర్చుని పంపకాలు చేసుకుంటుండగా వారిలో వారికే తేడాలు వచ్చాయి. విషయం బయటకు పొక్కడంతో ఆలయ ఈఓ అర్చకులు, సిబ్బంది సమక్షంలో తిరిగి నగల మూటను హుండీలో వేసినట్లు తెలుస్తోంది.
ఆభరణాలు మాయం!
వేలూరు రంగయ్య దంపతులు స్వామి వారికి సమర్పించిన ఆభరణాలను మాయం చేసిన ఘటనపై దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) ఆదిశేషనాయుడు విచారణ చేపట్టారు. అయితే బంగారు మూటలో రూ.5 లక్షలకుపైగా విలువ చేసే ఆభరణాలు ఉండగా, ఇందులో ముక్కుపుడక, బంగారు పట్టీలు మాయమైనట్లు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టి 15 రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని, బాధ్యులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఏసీ తెలిపారు.
పెన్నహోబిలం ఆలయ హుండీలోని
బంగారు మూట మాయం
ఆలయ సిబ్బంది చేతివాటం
పంపకాల్లో తేడాలతో బహిర్గతం


