మండుటెండనూ లెక్కచేయక లక్షలాదిగా తరలివచ్చిన జనం
సర్వాలంకృతుడైన శ్రీవారి దర్శనంతో పులకించిన భక్తజనం
గోవింద నామస్మరణతో మార్మోగిన కదిరి
సాయంత్రం 4 గంటలకు యథాస్థానానికి చేరుకున్న తేరు
కదిరి ఆధ్యాత్మిక కడలిని తలపించింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనతరంగం ఉప్పెనలా ఎగసింది. ‘నమో నారసింహ... గోవిందా’ నామస్మరణ ప్రతిధ్వనించింది. భక్తిభావం ముందు భగభగ మండే భానుడే వెలవెలబోగా..ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. ఖాద్రీశుడి బ్రహ్మ రథోత్సవం వేళ చిన్నా,
కదిరి: ఖాద్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మ రథోత్సవం గురువారం అశేష భక్తజనం మధ్య అత్యంత వైభవంగా జరిగింది.‘శ్రీలక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవిందా, ప్రహ్లాద వరద గోవిందా..గోవిందా, జయ జయ సింహా..జయ నరసింహా’’ అంటూ భక్తులు కీర్తించగా.. గోవింద నామ స్మరణతో కదిరి మార్మోగింది. బ్రహ్మ రథోత్సవం నాడు సాక్షాత్తు బ్రహ్మ దేవుడే రథాన్ని నడిపి శ్రీవారు తిరువీధుల్లో విహరించేందుకు సహకరించి భక్తులంతా స్వామిని దర్శించుకునేలా చూస్తారని భక్తుల నమ్మకం.
మూడు గంటల ఆలస్యం..
ఉదయం సరిగ్గా 8.15 గంటలకు బ్రహ్మరథం ముందుకు కదిలింది. తిరువీధుల్లోని చౌక్ సర్కిల్‌లో ఒక సారి, హిందూపూర్ సర్కిల్‌లో మరోసారి.. ఇలా రెండు సార్లు తేరు మోకులు తెగిపోవడంతో గంటన్నర చొప్పున మూడు గంటలు ఆలస్యమైంది. సరిగ్గా సాయంత్రం 3.53 గంటలకు బ్రహ్మరథం యథాస్థానం చేరు కుంది. రథం యథాస్థానం చేరుకోవడానికి గతంలో ఎన్నడూ ఇంత ఆలస్యం కాలేదు.
బలిహరణం, ఆస్థాన పూజలతో మొదలు..
ఉదయాన్నే ఆలయ అర్చక బృందం తేరు ముందు బలిహరణం, ఆస్థాన పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి, ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రముఖులు రథం వద్ద జరిగిన తొలి పూజల్లో పాల్గొని, తర్వాత రథంపై శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రథాన్ని కాసేపు లాగి తమ భక్తిని చాటుకున్నారు.
తిరు వీధుల ఆక్రమణల కారణంగా బ్రహ్మరథం లాగేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. ఓ వైపు ఎండలు మండుతున్నా భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకొని రథంపైకి దవనం, మిరియాలు చల్లేందుకు గంటల తరబడి వేచి ఉన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, ఆయన కుమారుడు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ ఎప్పటిలాగానే రథంపై నిల్చొని రథ కదలికలను మైకు ద్వారా తెలియజేశారు.


