చెన్నేకొత్తపల్లి: మండల కేంద్రానికి సమీపంలోని నిర్జన ప్రదేశాల్లో ప్లాస్టిక్ బస్తా నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. విషయం తెలుసుకున్న సీకేపల్లి సివిల్, హిందూపురం రైల్వే పోలీసులు ఉరుకుల పరుగులతో గాలింపు చేపట్టారు. అయితే ఒకటి కాదు... రెండు కాదు... అర కిలోమీటరుకు ఒకటి చొప్పున పడేసిన మూడు ప్లాస్టిక్ బస్తాల్లో నుంచి కుళ్లిన దుర్వాసన వెలువడుతుండడంతో పోలీసులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు.
ఏడు గంటల పాటు ఉత్కంఠ
చెన్నేకొత్తపల్లి సమీపంలో ఉన్న యర్రంపల్లి రైల్వే వంతన కింద ప్లాస్టిక్ సంచి నుంచి దుర్వాసన వస్తున్న విషయాన్ని పసిగట్టిన స్థానికుల సమాచారంతో ధర్మవరం రైల్వే సీఐ అశోక్‌కుమార్, రామగిరి సీఐ శ్రీధర్, చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ సత్యనారాయణ, హిందూపురం రైల్వే ఎస్‌ఐ సాయినాథ్‌రెడ్డి, ఐడబ్ల్యూ రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి, కానిస్టేబుల్ రమేష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. అదే సమయంలో అక్కడికి అర కిలోమీటర్ దూరంలో మరో బస్తా నుంచి దుర్వాసన వస్తోందని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఆందోళనతో అక్కడకు పరుగు తీశారు. కేబుల్ వైర్ కోసం తీసిన గుంతలో ప్లాస్టిక్ బస్తాను గుర్తించి వెలికి తీశారు. ఈ లోపు అక్కడికి అర కిలోమీటర్ దూరంలో మరో బస్తా నుంచి దుర్వాసన వస్తోందని తెలుసుకుని అక్కడకూ ఆగమేఘాలపై చేరుకున్నారు. బస్తాల పరిమాణాన్ని బట్టి ముగ్గురు వ్యక్తులను హతమార్చి ప్లాస్టిక్ సంచుల్లో కూరి పడేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాదాపు ఏడు గంటల పాటు యర్రంపల్లి వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన తర్వాత ఒక్కో బస్తాను తెరిచి చూసిన పోలీసులు అవాక్కయ్యారు. అందులో అందరూ ఊహించినట్లుగా వ్యక్తుల మృతదేహాలు కాకుండా మేక పిల్లల కళేబరాలు బయటపడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలా ఎందుకు చేశారు? ఎవరు చేశారు? అనేది తేలాల్సి ఉంది.
అర కిలోమీటరు దూరంతో మూడు సంచులు
రైల్వే, సివిల్ పోలీసుల పరుగులు
బస్తాల్లో బయటపడిన మేక పిల్లల కళేబరాలు
ప్లాస్టిక్ సంచుల కలకలం


