● రైలుకిందపడి తల్లి ఆత్మహత్య
తాడిపత్రి: ప్రేమ వివాహానికి తాను అంగీకరించకపోవడం వల్లే తనయుడు ప్రాణం తీసుకున్నాడని మనోవేదనకు గురైన తల్లి తను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తాడిపత్రిలో చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప తెలిపిన వివరాలిల ఉన్నాయి. పట్టణంలోని శ్రీనివాసపురానికి చెందిన కొండజోగుల శైలజ (40), సురేంద్రబాబు దంపతులకు శ్రీచరణ్ ఏకై క సంతానం. కుమారుడు అనంతపురంలో డిప్లొమా పూర్తి చేశాడు. శ్రీచరణ్ బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు కొద్ది రోజుల క్రితం వీరిద్దరి వివాహం చేసేందుకు ఒప్పుకోవాలని శైలజను కోరారు. ఇందుకు ఆమె నిరాకరించడంతో శ్రీచరణ్ అనంతపురం శివారులోని ప్రసన్నాయపల్లిలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తాడిపత్రిలో అంత్యక్రియలు ముగిశాయి. కుమారుడి చావుకు కారణమయ్యావంటూ బంధువులు, కుటుంబ సభ్యులు విమర్శలు చేయడంతో మానసికంగా కుంగిపోయిన శైలజ శనివారం ఉదయం రైలుకిందపడి బలవన్మరణానికి పాల్పడింది. సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని ఎస్‌ఐ నాగప్ప తెలిపారు.
మగ్గం వర్క్‌పై ఉచిత శిక్షణ
అనంతపురం: రూడ్‌సెట్ సంస్థలో ఏప్రిల్ 3 నుంచి నెల రోజులపాటు నిరుద్యోగ మహిళలకు జర్దోసి మగ్గం వర్క్‌పై ఉచిత శిక్షణ కల్పించనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వారై ఉండి, ఆధార్, రేషన్ కార్డు కలిగిన మహిళలు దరఖాస్తుకు అర్హులుగా పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 94925 83484 నంబరులో సంప్రదించాలన్నారు.


