
దానిమ్మ చెట్లకు చీరలను కప్పి కాయలకు రక్షణ ఏర్పాటు చేసుకున్న దృశ్యం
పుట్లూరు: చెట్టు చెట్టుకో చీర కట్టి భానుడి నుంచి పండ్ల తోటలను రక్షించుకుంటున్నారు రైతన్నలు. అరటి రైతులు ఇప్పటికే అరటి మొక్కలను రక్షించుకోవడానికి ఈత ఆకులు, న్యూస్ పేపర్లను రక్షణగా ఉంచడం చూశాం. అయితే, అందుకు భిన్నంగా దానిమ్మ కాయలను ఎండ నుంచి రక్షించుకోవడానికి పుట్లూరు మండలం కందికాపుల గ్రామానికి చెందిన కె.రంగనాయకులు అనే రైతు చెట్లకు చీరలు చుట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 800 దానిమ్మ చెట్లను చీరలతో కప్పేశారు. రంగనాయకులు రెండు ఎకరాల్లో దానిమ్మ పంటను మూడేళ్లుగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట బాగా ఉన్న సమయంలో ఎండ వేడికి కాయలు నల్లగా మారడం, కాయలోని విత్తనాలు దెబ్బతినడాన్ని గమనించారు. దీంతో ఆయన ఒక్కో చీర రూ.20 ప్రకారం కొనుగోలు చేసి ప్రతి చెట్టుకు కప్పి కాయలకు రక్షణ ఏర్పాటు చేశారు. దీంతో కాయలు నాణ్యతగా ఉంటాయనే ఆశ ఉందని ఆ రైతు ఆశాభావం వ్యక్తం చేశారు.