హేమలత ఆత్మహత్యకు వేధింపులే కారణం

- - Sakshi

అనంతపురం క్రైం: సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సాయి హేమలత (28) ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమని అనంతపురం నాల్గో పట్టణ సీఐ ప్రతాపరెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసులో అత్తతో పాటు భర్త, అతని తమ్ముడు, ఆడపడుచుని అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన సాయి హేమలతకు అనంతపురం నగర శివారులోని పీవీకేకే కళాశాల సమీపంలో నివాసముంటున్న కళ్యాణ చక్రవర్తితో 9 నెలల క్రితం వివాహమైంది. అత్తారింట్లో కాలు పెట్టినప్పటి నుంచి అదనపు కట్నం కోసం ఆమెను భర్త, ఆయన కుటుంబసభ్యులు వేధించేవారు.

విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో పలుమార్లు పెద్దలు పంచాయితీ నిర్వహించి సర్ది చెప్పారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే సాయి హేమలతకు ప్రతి నెలా వచ్చే వేతనాన్ని ఎప్పటికప్పుడు కళ్యాణ్‌ తన ఖాతాలోకి మళ్లించుకునేవాడు. కనీస ఖర్చులకు సైతం డబ్బు ఇచ్చేవాడు కాదు. గత వారం భర్త, కుటుంబసభ్యులు ఉత్తర కర్ణాటక సందర్శనకు సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని సాయి హేమలతకు తెలపడంతో ఆమె రుతుక్రమ ఇబ్బందుల కారణంగా యాత్రను వాయిదా వేయాలని కోరింది. దీంతో ఆమె మనోభావాలను కించపరిచేలా మాట్లాడి కుటుంబసభ్యులతో కలసి యాత్రకు భర్త తరలివెళ్లాడు.

టూర్‌లో ఉన్న భర్తకు ఆమె పలుమార్లు ఫోన్‌ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన సాయిహేమలత గత ఆదివారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై సాయి హేమలత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారణ కావడంతో కళ్యాణ్‌చక్రవర్తి, లక్ష్మీనరసమ్మ, కుమార్‌ ప్రేమ్‌సాయి, వరలక్ష్మిపై వేధింపుల కేసు నమోదు చేసి, మంగళవారం అరెస్ట్‌ చేశారు. నిందితులను న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top