రేయ్‌.. మాపైనే నీళ్లు పోస్తావా!

- - Sakshi

అనంతపురం/రాప్తాడురూరల్‌: అన్నం వడ్డించే క్రమంలో పొరబాటున నీళ్లు పడడంతో ఓ దళిత యువకుడిని పరిటాల శ్రీరామ్‌ అనుచరులు చితకబాదారు. ఈ నెల 7న అనంతపురం రూరల్‌ మండలం కృష్ణంరెడ్డిపల్లి క్రాస్‌ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటుకలపల్లి సీఐ నరేంద్రరెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం నగరానికి చెందిన దళిత శేఖర్‌ ఓ ప్రైవేట్‌ కంటి ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఆస్పత్రి యజమాని, అతడి స్నేహితులు ఈ నెల 7న బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు సమీపంలోని తోటలో విందు ఏర్పాటు చేసుకున్నారు.

పరిటాల శ్రీరామ్‌ అనుచరులైన ఇటుకలపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు అక్కులప్ప కుమారుడు అనిల్‌, మాల్యవంతం శీన, ముష్టూరు సాంబ, ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన ఎస్‌ఎంఎస్‌ రాజు హాజరయ్యారు. యజమాని సూచన మేరకు శేఖర్‌ ఏర్పాట్లలో పాల్గొన్నాడు. భోజనం వడ్డించే క్రమంలో శేఖర్‌ గ్లాసులో నీళ్లు పోస్తుండగా పొరపాటున శ్రీరామ్‌ అనుచరులపై పడ్డాయి. అక్కడే శేఖర్‌తో వాగ్వాదానికి దిగారు. అక్కడున్న వారు కల్పించుకుని సర్ది చెప్పారు. విందు ముగించుకుని రాత్రి 11 గంటల సమయంలో శేఖర్‌ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అనంతపురం నగరానికి బైకులో బయలుదేరారు.

కృష్ణంరెడ్డిపల్లి క్రాస్‌ సమీపంలోకి రాగానే వెనుక నుంచి పోలీస్‌ సైరన్‌తో బొలెరో వాహనంలో వచ్చి బైక్‌ను ఆపారు. వాహనం నుంచి కిందకు దిగిన అనిల్‌, మాల్యవంతం శీన, సాంబ, రాజు నలుగురూ కలిసి శేఖర్‌పై దాడికి పాల్పడ్డారు. ‘పార్టీలో మా మీద నీళ్లు పోస్తావారా.. నా కొడకా! మేము ఎవరో తెలుసారా?’ అంటూ కులం పేరుతో దూషిస్తూ దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితుడు ఇటుకలపల్లి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు నిందితులు నలుగురిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top