బైకుల సీజ్‌.. తల్లిదండ్రులపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

బైకుల సీజ్‌.. తల్లిదండ్రులపై చర్యలు

Feb 4 2026 7:19 AM | Updated on Feb 4 2026 7:19 AM

బైకుల

బైకుల సీజ్‌.. తల్లిదండ్రులపై చర్యలు

రాప్తాడురూరల్‌: షర్ట్‌ విప్పి విన్యాసాలు చేసుకుంటూ రోడ్డుపై బైకు నడిపిన బాలురకు రాప్తాడు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వారు నడిపిన బైకులను సీజ్‌ చేశారు. వివరాలను రాప్తాడు సీఐ శ్రీహర్ష మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతపురం రాణినగర్‌కు చెందిన బాలురు ఈనెల 1న బుక్కరాయసముద్రంలో జరిగిన తేరుకు వెళ్లారు. అక్కడి నుంచి మూడు బైకుల్లో రాప్తాడు సమీపంలోని అయ్యవారిపల్లి వంక వద్దకు ఈతకు బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డుపై విన్యాసాలు చేసుకుంటూ వెళ్లారు. ఓ బాలుడు అత్యుత్సాహంతో షర్ట్‌ను విప్పేసి బైకు నడిపాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీసి... ‘గంజాయి బ్యాచ్‌ హల్‌చల్‌’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. వీడియో వైరల్‌ కావడంతో ఎస్పీ జగదీష్‌ స్పందించి రాప్తాడు పోలీసులను విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే సాంకేతికత ఆధారంగా బాలురు, వారి తల్లిదండ్రులను గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. మైనర్లు నడిపిన బైకులను సీజ్‌ చేశారు. బైకుల రిజిస్ట్రేషన్ల రద్దుకు ఆర్టీఏ అధికారులకు లేఖ రాశారు. మైనర్లకు బైకులు ఇచ్చిన తల్లిదండ్రులపై ఎంవీఐ యాక్ట్‌ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం తగదని, సదరు వీడియో పోస్ట్‌ చేసిన వ్యక్తిని గుర్తించి నోటీసు జారీ చేస్తామన్నారు.

యువకుడి దారుణ హత్య

గంజాయి బ్యాచ్‌ పనేనని

గ్రామస్తుల ఆరోపణ

రొద్దం: యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన రొద్దం మండలం పెద్దకోడిపల్లిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దకోడిపల్లికి చెందిన బోయ మల్లికమ్మ, పోతన్న ఒక్కగానొక్క కుమారుడు లింగమయ్య (24). ఏడాది క్రితం తండ్రి పోతన్న మృతి చెందడంతో లింగమయ్య రోజూ దానిమ్మ కాయల ప్యాకింగ్‌కు వెళ్తూ తల్లి మల్లికమ్మను పోషించుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం నలుగురు మిత్రులతో కలిసి గ్రామ శివారు ప్రాంతానికి మద్యం సేవించడానికి వెళ్లినట్లు సమాచారం. స్నేహితులు కత్తితో మెడపై విచక్షణా రహితంగా పొడవడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిసింది. గంజాయి బ్యాచ్‌ లింగమయ్యను హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజూ గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులతో వాపోయారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సీఐ రాఘవన్‌, ఎస్‌ఐ వీరాంజినేయులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్తులతో విచారణ చేపట్టారు. ఓ నిందితుడు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బైకుల సీజ్‌..  తల్లిదండ్రులపై చర్యలు 1
1/2

బైకుల సీజ్‌.. తల్లిదండ్రులపై చర్యలు

బైకుల సీజ్‌..  తల్లిదండ్రులపై చర్యలు 2
2/2

బైకుల సీజ్‌.. తల్లిదండ్రులపై చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement