రీ సర్వే వేగవంతం చేయండి
ఆత్మకూరు: భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార అర్జీలు గడువులోపు పరిష్కరించాలని, పట్టాదార్‌పాసు పుస్తకాల పంపిణీ సజావుగా చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బాలమ్మ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీహరి పాల్గొన్నారు.
ప్రాక్టికల్ పరీక్షలకు
228 మంది గైర్హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో భాగంగా మంగళవారం నాటి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 228 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జనరల్ విద్యార్థులు 2.819 మందికి గాను 2,770 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,085 మందికి గాను 985 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు జనరల్ విద్యార్థులు 2,634 మందికి గాను 2,585 మంది, ఒకేషనల్ విద్యార్థులు 881 మందికి గాను 851 మంది హాజరయ్యారు.
ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు
కుందుర్పి: అప్పిలేపల్లిలో బొబ్బులకుంట ఆంజనేయస్వామి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం స్థానిక హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి మొత్తం 12 జతల ఎద్దులు పోటీల్లో పాల్గొన్నాయి. గెలుపొందిన వృషభాల యజమానులకు ఆలయ ధర్మకర్త మల్లికార్జునగౌడు, సర్పంచ్ అతావుల్లా తదితరులు నగదు బహుమతులు అందజేశారు.
బాలికపై అత్యాచారం
● నిందితునిపై పోక్సో కేసు
అనంతపురం సెంట్రల్: ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికను వంచించాడు. శారీరక వాంఛ తీర్చుకుని గర్భవతిని చేశాడు. విషయం తెలిసి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం ఎర్రగుడికి చెందిన మహేంద్ర అనే యువకుడు అనంతపురంలోని వేణుగోపాల్‌నగర్‌లో ఎంబ్రాయిడరీ షాపులో పనిచేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన పదో తరగతి బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పలుమార్లు శారీరకంగా కలవడంతో బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మంగళవారం వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
రీ సర్వే వేగవంతం చేయండి


