కబళిస్తున్న క్యాన్సర్
అనంతపురం మెడికల్: క్యాన్సర్.. ఈ పేరు వింటేనే ఎవరైనా భయోత్పాతానికి గురి కావాల్సిందే. రొమ్ము, నోటి, గర్భాశయ ముఖద్వార, తదితర క్యాన్సర్లు ముదిరితే ప్రాణానికే ముప్పు. అటువంటి భయానక క్యాన్సర్ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సత్ఫలితాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నా.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ క్యాన్సర్ రోగులను గుర్తించడంలో పూర్తిగా విఫలమవుతోందన్న విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని ఆరోగ్య శాఖ రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోంది. ఆరోగ్యశాఖ, ప్రజల ముందు చూపుతోనే క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ యూనిట్‌లో సౌకర్యాలు మృగ్యం
అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి (జీజీహెచ్) పరిధిలోని క్యాన్సర్ యూనిట్‌లో 2024 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు 1,600 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో 550 మంది కీమో, 87 మంది రేడియో థెరపీ చికిత్సలు తీసుకుంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. క్యాన్సర్ రోగులకు పెద్దదిక్కు ఈ యూనిట్టే. ఇక్కడ పాత, నూతన ఓపీలను కలుపుకుని రోజూ వందకుపైగా కేసులు ఉంటాయి. కాగా ఇక్కడ అడ్మిషన్ ఉండదు. మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. కీమో రోగులు బయట కొనుగోలు చేసుకునే పరిస్థితి. ఇక రేడియేషన్ అవసరమైన రోగులు కర్నూలు, లేకపోతే జిల్లా కేంద్రంలోనే ఓ క్యాన్సర్ ఆస్పత్రికి పరుగులు పెట్టాల్సి వస్తోంది. కోబాల్ట్ మిషన్ తరచూ మరమ్మతుకు గురవుతోంది. దీంతో రోగులకు అవస్థలు వర్ణనాతీతం.
ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం
క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడానికి స్క్రీనింగ్ ముఖ్యం. అటువంటి స్క్రీనింగ్ నిర్వహించడంలో ఆరోగ్య శాఖ విఫలమైందన్న విమర్శలున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 663 ఎంపిక చేసిన సచివాలయాల పరిధిలో 19,39,417 మందికి స్క్రీనింగ్ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 6,37,261 మందికి(32.85శాతం) స్క్రీనింగ్ చేసినట్లు ఆరోగ్యశాఖ రికార్డుల్లో నమోదు చేశారు. కాగా ఆరోగ్యశాఖ నిర్వహించిన స్క్రీనింగ్‌ను తూతూమంత్రంగా చేపట్టినట్లు తెలుస్తోంది.
ప్రారంభ దశలోనే గుర్తించాలి
క్యాన్సర్‌ను ప్రారంభదశలోనే గుర్తించాలి. తద్వారా రోగులు కోలుకునేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి. నాల్గవ స్టేజ్‌లో వచ్చినప్పుడు రోగులకు కోలుకునేందుకు సమయం తీసుకుంటుంది. క్యాన్సర్ యూనిట్‌లో వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలందిస్తున్నాం.
– డాక్టర్ ప్రశాంతి, అసోసియేట్ ప్రొఫెసర్, క్యాన్సర్ యూనిట్, అనంతపురం
నేడు ప్రపంచ క్యాన్సర్ దినం
జిల్లాలో పెరుగుతున్న బాధితులు
కేసులను గుర్తించడంలో ఆరోగ్యశాఖ విఫలం
క్యాన్సర్ యూనిట్‌లో అరకొర సౌకర్యాలతో రోగుల అవస్థలు


