‘రాయలసీమ ఎత్తిపోతల’ ఆపడం దుర్మార్గం
అనంతపురం ఎడ్యుకేషన్: సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మకై ్క రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపడం దుర్మార్గమని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏ ప్రాంతానికి అన్యాయం చేసే స్కీం కాదన్నారు. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ కాలువలకు సంబంధించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లు అందాలంటే శ్రీశైలం డ్యాంలో 881 అడుగుల్లో నీళ్లు ఉండాలన్నారు. ఇది వరద రోజుల్లో తప్ప తక్కిన రోజుల్లో సాధ్యం కాదన్నారు. 800 అడుగులకు దిగువన నీళ్లుండగా పాలమూరు–రంగారెడ్డి, దిండి ప్రాజెక్ట్‌ల ద్వారా తోడుకునే వ్యవస్థను తెలంగాణ ఏర్పాటు చేసుకుందన్నారు. మనకు కూడా హక్కుగా ఉన్న వాటా కోసం 800 అడుగులకు దిగువన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. చంద్రబాబు పాలనలో జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. హంద్రీ–నీవా ద్వారా చివరి ఆయకట్టు ప్రాంతాలైన చిత్తూరు, రాయచోటి జిల్లాలకు నీళ్లు ఇవ్వడం ఇబ్బందిగా మారడంతో గండికోట నుంచి గాలేరు–నగరి ప్రాజెక్ట్ ద్వారా హంద్రీ–నీవాకు లింకు చేసే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చారన్నారు. 50 శాతం పనులు కూడా చేశారన్నారు. ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం, కర్నూలు జిల్లాలకు 20 టీఎంసీల నీరు ఆదా అవుతుందన్నారు. హంద్రీ–నీవా కాలువను 40 టీఎంసీల నుంచి 63 టీఎంసీలకు వెడల్పు చేస్తామని గతంలో చంద్రబాబు చెప్పారని, జగన్ హయాంలో పనులు కూడా జరిగాయన్నారు. ఇది పూర్తయితే 63 టీఎంసీల నీరు అనంతపురం, కర్నూలు జిల్లాకు వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. అలాంటి ప్రాజెక్టును కూడా చంద్రబాబు ఆపేశారన్నారు. ఈనెల 5న పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సాగునీటి హక్కుల కోసం పోరాడాలన్నారు. మసిపూసి మారేడు కాయ చేస్తున్న చంద్రబాబు వైఖరిని తిప్పికొడదామన్నారు.
జగన్ హయాంలో ప్రతినెలా పండుగే
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో ప్రతినెలా పండుగ ఉండేదన్నారు. 12 నెలల కేలండర్‌లో తేదీ ముందుగానే ప్రకటించి ప్రతినెలా సంక్షేమ పథకాన్ని అమలు చేశారన్నారు. ఐదేళ్లలో 60 నెలల్లో 60 పండుగలు చూశామన్నారు. ఈరోజు చంద్రబాబు ఎన్నో ఆశలు కల్పించి ఉసూరుమనిపించారన్నారు. ప్రజల కళ్లు బైర్లు కమ్మేలా మేనిఫెస్టోలో పథకాలు రూపొందించినా అమలు శూన్యం అన్నారు.
ఇళ్ల నిర్మాణాల ఆపిన పాపం వారిదే
ఓనమాలు రాని, డబ్బు తప్ప ప్రజలమీద ధ్యాస, ప్రేమ లేని ఎమ్మెల్యేలు విచారణల పేరుతో ఇళ్ల నిర్మాణాలు ఆపారన్నారు. అనంతపురం నగరం, రూరల్ పాపంపేట, కక్కలపల్లికాలనీ ప్రాంతాలకు చెందిన పేదలకు ఆలమూరు, కొడిమి జగనన్న కాలనీల్లో పట్టాలిచ్చామన్నారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సంస్థ నుంచి డబ్బులు ఆశించిన ప్రజాప్రతినిధులు నిర్మాణాలు జరగకుండా అడ్డుకున్నారన్నారు. జగనన్న కాలనీల్లో సిమెంటు, ఇసుక, కడ్డీలు, సెంట్రింగ్ మెటీరియల్ దొంగలపాలైందన్నారు. పరిటాల సునీత రాసిన లేఖ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్లు నిర్మించుకోలేని పేదలకు ప్రభుత్వమే ‘ఆప్షన్–3’ ద్వారా కట్టించి ఇచ్చిందన్నారు. మార్చి తర్వాత ఈ ఆప్షన్–3 ఉండదన్నారు. లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకోవాల్సి ఉంటుందన్నారు. దీనికి పరిటాల సునీత, అసమర్థ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బాధ్యత వహించాలన్నారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే..
అన్నింటా వైఫల్యం చెందిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించేందుకు తిరుపతి లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చాడన్నారు. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని సిట్ కూడా స్పష్టమైన నివేదిక ఇచ్చిందన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడిని తీవ్రంగా ఖండించారు. 2019–24 మధ్య ఇలానే చేశామా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ విధానాన్ని ఖండించాలన్నారు. విమర్శను ఎదుర్కోలేక దాడులకు పూనుకోవడం మంచిదికాదని, దేవుడిని రాజకీయానికి వాడుకోవడం తప్పు అన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికై నా తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు జూటూరు చంద్రకుమార్, వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, దుగుమర్రి గోవిందరెడ్డి, నారాయణరెడ్డి, జూటూరు శేఖర్, నెమలివరం రఘు, లింగారెడ్డి, ఉప్పరపల్లి శీనా, భానుకోట శివ, ఇటుకలపల్లి చిరంజీవి పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కు
చంద్రబాబు కుట్ర వివరించేందుకే 5న బహిరంగ సభ
రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలి
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి


