సీమ ప్రయోజనాలను పరిరక్షించాలి
అనంతపురం: ‘రాయలసీమ ప్రజలకు జీవనాడి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయడంతో పాటు హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయాలి. రాయలసీమ ప్రయోజనాలను పరిరక్షించాలి’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 5న నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ‘చలో పోతిరెడ్డిపాడు’ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. వైఎస్సార్‌సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, ఎస్‌ఈసీ సభ్యులు మీసాల రంగన్న, లింగాల శివశంకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్, మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్లు దాసరి వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శంకరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత, వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షిస్తూ 9.6 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ ప్రారంభించారని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా దాదాపు రూ.3,700 కోట్లతో ఆనాడే పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాయలసీమ జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతో హంద్రీ–నీవా పనులు చేపట్టారన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 10 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 40 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచారని వెల్లడించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్’ పనులకు సమాధి కట్టారని విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన రహస్య ఒప్పందంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చంద్రబాబు ఆపేశారని వివరించారు. ఈ విషయాన్ని స్వయంగా రేవంత్‌రెడ్డే చెప్పారన్నారు. వైఎస్ జగన్ రాయలసీమకు నీటిని అందించాలన్న సంకల్పంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడితే.. చంద్రబాబు పనులు ఆపేసి రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రేపు పోతిరెడ్డిపాడులో జరిగే బహిరంగ సభకు జిల్లా నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి


